టీడీపీ కంచుకోటపై 'సజ్జల' గురి
వచ్చే ఎన్నికలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలకు కూడా ఎంతో కీలకం. ఓటమిపాలైన పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొని నిలవగలుగుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించనుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాపై వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 16 సీట్లకు వైసీపీ 14 నియోజకవర్గాలను కైవసం చేసుకొని టీడీపీని చిత్తు చేసింది.
2024 ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం కావాలన్న లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఇటీవలే విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన రామకృష్ణారెడ్డి నగరంలోని మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఈస్ట్ లో దేవినేని అవినాష్, వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ లో మల్లాది విష్ణును ఫిక్స్ చేశారు.

వీరు కాకుండా జిల్లాలో 90 శాతానికి పైగా అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, పెనమలూరులో పార్థసారథి, పామర్రులో కైలే అనిల్ కుమార్ పోటీచేయబోతున్నారు. నందిగామలో జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను, తిరువూరులో రక్షణనిధి, నూజివీడులో మేకా ప్రతాప్ పోటీచేస్తున్నట్లుగానే భావించవచ్చని.. ఇక్కడ ఎటువంటి మార్పులు ఉండవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కైకలూరులో ప్రస్తుత ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? లేదా?అనేది స్పష్టత రావాల్సి ఉంది.
పెడనలో జోగి రమేష్, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ సీట్లకు సంబంధించి ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతుండటంతో ఆయనేమైనా పార్టీ మారతారా? లేదంటే జోగి రమేష్ ను మైలవరం నుంచి పోటీ చేయిస్తారా? అనే విషయమై వైసీపీ అధిష్టానం నిర్ణయానికి రాలేదు. అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని బదులు..ఆయన తనయుడు పేర్ని కృష్ణమూర్తి దాదాపుగా పోటీచేయడం ఖాయమైంది. అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబుకు మళ్ళీ అవకాశం లభించవచ్చు.












Click it and Unblock the Notifications