
టీడీపీ సిట్టింగ్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి ఖరారు..!!
వచ్చే ఎన్నికల కోసం అభ్యర్ధుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. టీడీపీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీట్లు ఖాయమని ప్రకటించింది. టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో నలుగురు ఇప్పుడు వైసీపీకి దగ్గరయ్యారు. మిగిలిన నియోజవకర్గాల పైన సమీక్షలు చేసిన చంద్రబాబు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. జనసేన - టీడీపీ పొత్తు కారణంగా కొంత మంది టీడీపీ ముఖ్యులు సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.
ఇదే సమయంలో అధికార వైసీపీ ముందుగా టీడీపీ సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. సమీక్షల సమయంలోనే అభ్యర్ధులను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది.

చీరాల అభ్యర్ధిగా కరణం వెంకటేష్
రానున్న ఎన్నికలకు చీరాల వైసీపీ అభ్యర్ధిగా కరణం వెంకటేష్ ను వైసీపీ ఖరారు చేసింది. వైసీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో 2014 లో స్వతంత్ర అభ్యర్ధిగా ఆమంచి క్రిష్ణ మోహన్ గెలవగా, ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం విజయం సాధించారు.
ఆ తరువాత కొంత కాలానికే కరణం బలరాం తన కుమారుడుతో పాటుగా సీఎం జగన్ ను కలిసారు. కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వైసీపీలో చేరారు. అప్పటి నుంచి బలరాం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అక్కడ కొద్ది రోజల క్రితం వరకు కరణం..ఆమంచి.. పోతుల సునీత మధ్య టికెట్ కోసం పోటీ కొనసాగింది. అయితే, వైసీపీ అధినాయకత్వం ఆమంచిని ఒప్పించి పర్చూరు ఇంఛార్జ్ గా కేటాయించింది. ఫలితంగా ఇప్పుడు కరణం వెంకటేష్ ను చీరాల లో లైన్ క్లియర్ అయింది. కరణం వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు.

మద్దతు ప్రకటించిన పోతుల సునీత..
ఎమ్మెల్సీ పోతుల సునీత చీరాల నుంచి కరణం వెంకటేష్ అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటించారు. సునీతకు మరోసారి ఎమ్మెల్సీగా కొనసాగింపుకు పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమంచి కూడా పర్చూరు బాధ్యతలు తీసుకోవటంతో..ఇప్పుడు కరణం వెంకటేష్ ఇక పార్టీ అభ్యర్దిగా ఎన్నికలకు సిద్దం కానున్నారు.
వెంకటేష్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన బీదా మస్తాన రావు త్వరలోనే సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న కరణం బలరాం కు ప్రకాశం జిల్లాలో మంచి పట్టు ఉంది. ఇప్పుడు కుమారుడు వెంకటేష్ కు చీరాల వైసీపీ టికెట్ ఖరారు కావటంతో వచ్చే ఎన్నికల్లో బలరాం వైసీపీ గెలుపు కోసం పని చేయనున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ నుంచి వచ్చిన ఇద్దరికి టికెట్ల ఖరారు
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వారిలో ఇద్దరికి ఇప్పటి వరకు టికెట్లు ఖరారయ్యాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం సీటు ఖరారు చేసింది. అక్కడ వైసీపీ నేతలు రామచంద్రరావు, వెంకటరావు పోటీ దారులుగా ఉన్నారు. వంశీని వ్యతిరేకిస్తున్నారు. కానీ, వారిద్దరికీ ప్రత్యామ్నాయం చూపిస్తూ..వంశీకి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడికి సీటు ఖరారైంది. మిగిలిన వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైసీపీ రెండు కీలక సీట్లను అభ్యర్దును ఖరారు చేసింది.