కుమారుడి ప్రభుత్వంపై వైఎస్ విజయమ్మ ఏం చెప్పారంటే: ప్రతిదినం..ప్రజాహితం పుస్తకంలో
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరును కేంద్రబిందువుగా చేసుకుని ప్రచురించిన ప్రతిదినం ప్రజాహితం పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ పాత్రికేయుడు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహదారు దేవులపల్లి అమర్ ఈ పుస్తకాన్ని రాశారు. ఏపీలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, జగన్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, నవరత్నాల గురించి ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లడారు. వైఎస్ జగన్ తన తండ్రి బాటలో నడుస్తున్నారని అన్నారు. గత పాలకుల హయాంలో ప్రజలు ఎదుర్కొన్న కష్ట, నష్టాలను జగన్ పాదయాత్ర సందర్బంగా దగ్గరుండి చూశారని, దానికి అనుగుణంగానే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని చెప్పారు. నవరత్నాల రూపకల్పనకు పాదయాత్ర ప్రధానంగా ఉపయోగపడిందని వైఎస్ విజయమ్మ అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికాలంలోనే 90 శాతం మేర మేనిఫెస్టో హామీలను జగన్ నెరవేర్చారని అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరికొత్త ఒరవడిని తీసుకొచ్చారని ప్రశంసించారు.

పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం ఒక్కటే మిగిలి ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని విజయమ్మ అన్నారు. జులై 8వ తేదీన ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ తన కుమారుడు సంక్షేమ పథకాలను విస్మరించ లేదని, తాను ఇచ్చిన హామీల మేరకు అన్ని వర్గాల వారికీ 10 వేల రూపాయలను జమ చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా బడుగు, బలహీన, దళిత, గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెెందిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను, వాటి అమలును వాయిదా వేయకుండా, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తుండటం తనకు గర్వంగా అనిపిస్తోందని విజయమ్మ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆరు లక్షలమందికి కరోనా పరీక్షలు చేసిన ఏపీ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నప్పటికీ.. వాటిని తన కుమారుడు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కితాబిచ్చారు. సంక్షేమ పథకాలను అమలు చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు.












Click it and Unblock the Notifications