షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ టార్గెట్ గా కూటమి నేతలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు మాజీ సీఎం జగన్ వచ్చే నెల నుంచి కొత్త కార్యాచరణ అమలు దిశగా సిద్దం అవుతున్నారు. పార్టీ ప్లీనరీకి నిర్ణయించారు. ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నేరుగా జగన్ టార్గెట్ చేస్తున్నారు. మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని పవన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ ముఖ్య నేత.. మాజీ మంత్రి కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని తిరిగి రాజకీయంగా గుడివాడలో యాక్టివ్ అవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి.. వరుస కేసులు.. అనారోగ్యం కారణంగా నాని రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. మాజీ సీఎం జగన్ తో సమావేశం.. పార్టీ నేతలకు మంతనాలకే పరిమితం అయ్యారు. ఇక.. ఇప్పుడు తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. 2029లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంపై స్పందించిన ఆయన... తన సొంత ఆస్తిలో కూడా చెల్లికి వాటా ఇచ్చారని చెప్పారు. అయిన వాళ్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా తిరిగి ఒక మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. జగన్ చెల్లిని తీసుకొచ్చి నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో లేనిపోని ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. కూటమిని దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
2029 లో జగన్ తిరిగి సీఎం అవ్వటం ఖాయం
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాడని.. కూటమి నేతల పరువు పోయిందన్నారు నాని. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతు లు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. ఆ సమయం లో తనతో సహా పేర్ని నాని సైతం జగన్ ను కలిసి మనం కూడా రుణాలు మాఫీ చేద్దామని జగన్‌ను కోరామని గుర్తు చేసారు. చంద్రబాబు చెప్పే హామీలు నెరవేర్చాలంటే ఏకంగా రూ.1.25వేల కోట్లు కావాలని జగన్ తమతో చెప్పారని.. ఆ హామీలు అమలు చేయడం కుదరదని అప్పుడే తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
రూ.1.25వేల కోట్లతో రుణాలు మాఫీ చేసేంత ఆదాయం ఎక్కడ ఉందని ఆ రోజే జగన్ తమను ప్రశ్నించారని వివరించారు. 2019 ఎన్నికల్లో ఆయన చేసిన మోసాన్ని తెలుసుకుని వైఎస్ జగన్‌కు ఓటేశారన్నారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో కూటమి నేతలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ పేద ప్రజలకు అండగా నిలబడ్డారని చెప్పారు. కూటమి ఇచ్చిన హామీల వల్ల జగన్ ఓడిపోయారన్నారు.2029 లో జగన్ తిరిగి సీఎం అవ్వటం ఖాయమని నాని ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications