జగన్ లేకపోయి ఉంటే: ఎన్టీఆర్ వర్ధంతి నాడు.. లక్ష్మీపార్వతి
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆయనకు నివాళి అర్పిస్తోన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శిస్తోన్నారు. టీడీపీకి చెందిన హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకష్ణ- ఈ తెల్లవారు జామునే తన తండ్రికి నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. నివాళి అర్పించారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి కొద్దిసేపటి కిందటే ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. సమాధిపై దీపం వెలిగించారు. పూలు చల్లి నివాళి అర్పించారు. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్టీ రామారావు స్వర్గస్తులైనప్పటి నుంచీ తాను దుర్భర జీవితాన్ని గడిపానని, తన అనుకున్న వాళ్లందరూ ఏకాకిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అగౌరవపర్చారని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు తాను వాటన్నింటినీ భరిస్తూ వచ్చానని చెప్పారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలు, పేదలను ఆదుకోవడానికి, ఎన్టీఆర్ ఆశయాన్ని సాధించాలనే ఆశతోనే తాను బతికానని వ్యాఖ్యానించారు.

అలాంటి దుస్థితిలో ఉన్న తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జీవితాన్ని ఇచ్చారని లక్ష్మీపార్వతి అన్నారు. తన జీవితాన్ని వైఎస్ జగన్ నిలబెట్టారని, సమాజంలో ఓ గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారని చెప్పారు. తనలాంటి ఎంతోమంది అభాగ్యులు, పేద కుటుంబాలకు చెందిన మహిళలు వైఎస్ జగన్ పరిపాలనలో సుఖ సంతోషాలతో జీవిస్తోన్నారని ప్రశంసించారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించడానికి ఎన్నో పథకాలను ఆయన అమలు చేస్తోన్నారని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు కూడా అలాంటి సమాజం కోసమే కలలు గన్నారని, కొన్ని దుష్ట శక్తులు దాన్ని ఛిద్రం చేశాయని చెప్పారు. తన కలలను సాకారం చేస్తోన్న వైఎస్ జగన్ పై ఎన్టీ రామారావు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, అడ్డంకులు సృష్టించినా- జగన్ తన లక్ష్యం వైపు సాగుతున్నారని కితాబిచ్చారు.
ఎన్టీ రామారావు తరువాత మళ్లీ వైఎస్ జగన్ అద్భుతంగా పరిపాలన చేస్తోన్నారని, సమాజంలో పేదలకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తోన్నారని అన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులను చదివిస్తోన్నారని, వారికోసం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోన్నారని చెప్పారు. తన లాంటి నీడలేని వారికి వైఎస్ జగన్ పెద్ద దిక్కుగా మారాడని, తన భర్త ఎన్టీఆర్ ఆశీస్సులు ఆయనకు అందాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications