పిఠాపురంలో పవన్ కల్యాణ్ తాజా పరిస్థితి ఇదీ..!!
Mudragada Padmanabham: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. తమ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులందరూ ఇంటింటి ప్రచార కార్యక్రమాలతో తలమునకలయ్యారు. కరపత్రాలను పంచుతున్నారు. స్థానిక నాయకులతో కలిసి రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు.
ఇటీవలే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ముమ్మరంగా ప్రచారం సాగిస్తోన్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు.

తనను హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టించి, అన్ని రకాలుగా హింసించిన చంద్రబాబు నాయుడు వంటి శతృవులతో పవన్ కళ్యాణ్ జట్టు కట్టాడని విమర్శించారు. కాపు రిజర్వేషన్లు, ఈ సామాజిక వర్గం బాగు కోసం గళం ఎత్తిన తనను చంద్రబాబు అణచివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు పవన్ ఏ మడుగులో దాక్కున్నారని ప్రశ్నించారు.
టీడీపీ కూటమికి ఓటు వెయ్యొద్దంటూ ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఆయన విశ్లేషించారు. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. టీడీపీ కూటమి తరఫున పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న నియోజకవర్గం ఇది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు ప్రతికూల వాతావరణం నెలకొని ఉందని, ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని, కనీసం వారి కోసం పోరాడుతున్న తనకు కూడా అండగా నిలవలేదని అన్నారు. కాపులు, వారికి రాజ్యాధికారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చివుంటే ఇప్పుడు ఆ ఉద్యమం చేయవచ్చు కదా అని నిలదీశారు.

కాపులకు ఎలాంటి న్యాయం కోసం పోరాడని వ్యక్తి పవన్ కల్యాణ్ అని, అలాంటి వ్యక్తి పార్టీ పెడితే తాను ఎలా వెళ్తానని ముద్రగడ పేర్కొన్నారు. 20 సీట్లు ఒప్పుకొన్న పవన్‌కు తాను ఎందుకు మద్దతు ఇవ్వాలని అన్నారు. గతంలో చిరంజీవి ఓడిపోయాడని, పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పరాజయం పాలయ్యాడని ఆయన గుర్తు చేశారు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని చేపట్టడం వల్ల తాను నష్టపోయానని, తన శత్రవులతో పవన్ కళ్యాణ్ కలిశాడని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓటమి కోసం తాను పని చేస్తానని, దీని కోసం ఎంతవరకైనా వెళ్తానని ముద్రగడ తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పవన్ కల్యాణ్కు చాలా తేడా ఉందని ముద్రగడ వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయని జగన్ ఎప్పుడో నిజాయితీగా చెప్పారని ప్రశంసించారు. 30 సంవత్సరాల పాటు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరాలంటూ జగన్ తనను ఆహ్వానించారని చెప్పారు.












Click it and Unblock the Notifications