మేం అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం: సజ్జల ఆందోళన- రీకౌంటింగ్
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ పరాజయాన్ని చవి చూడటంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పందించారు. పశ్చిమ రాయలసీమ ఫలితాలపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు.
అమరావతి: శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ.. స్థానాల్లో పరాజయాన్ని చవి చూసింది. ఈ మూడింటినీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. టీడీపీ అభ్యర్థులు ఉత్తరాంధ్ర- వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్-తూర్పు రాయలసీమ, భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి- పశ్చిమ రాయలసీమల్లో గెలిచారు.
ఈ ఓటమిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పందించారు. పశ్చిమ రాయలసీమ ఫలితాలపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఇవ్వాళ విలేకరులతో మాట్లాడారు. పశ్చిమ రాయలసీమ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకుందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కొందరు అధికారుల తీరుపై అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రీకౌంటింగ్ చేయాలని కోరుతామని అన్నారు.

ఒక్క బండిల్‌లోనే 6 ఓట్ల తేడా వచ్చిందని, అలా 2,000 బండిల్స్ లో ఒక్కొక్క ఓటు తేడా వచ్చినా ఫలితాలు తలకిందులవుతాయని సజ్జల అన్నారు. రీ కౌంటింగ్ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అనంతపురంలో అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని, కడప నుంచి టీడీపీ నాయకులు అనంతపురానికి తరలి వెళ్లారని, తమ పార్టీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేశారని సజ్జల పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తోందని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉండీ మౌనం వహించామని పేర్కొన్నారు. తాము ఎప్పుడూ ధర్మ యుద్ధమే చేస్తామని అన్నారు. రీకౌంటింగ్ అడగాల్సిన అవసరం ఉందా ? లేదా? ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనేదాని ప్రకారమే తాము నడుచుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబే మర్డర్ చేస్తాడని, మళ్లీ ఆయనే బట్ట కాల్చి ముఖంపై వేస్తాడని విమర్శించారు.

తాము అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం చేయాల్సి వస్తోందని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్కసు, కడుపు మంటను వెల్లగక్కడానికి చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకున్నాడని ధ్వజమెత్తారు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అన్నట్లు ఆయన వైఖరి ఉందని, చంద్రబాబు మాటలకు తాము విలువ ఇవ్వట్లేదని పేర్కొన్నారు. చంద్రబాబు తన అవసాన దశలో భ్రమల్లో బతుకుతున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications