టీడీపీకి జూన్ 4 సెంటిమెంట్..!!
Vijayasai Reddy: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటోన్నారు.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. పోలింగ ముగిసిన అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేకించి- మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత పల్నాడు జిల్లా రాజకీయలు వేడెక్కాయి. ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
దీనికి కొనసాగింపుగా తాజాగా వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తాజాగా రంగంలోకి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 2019 నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టారు. చంద్రబాబుపై జాలి చూపారు కూడా.

2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు.. తమ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు 23 స్థానాలే దక్కాయని చెప్పారు. అప్పట్లో మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగిందనీ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా
చంద్రబాబు తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని కొనుగోలు చేశాడని, జూన్ 4వ తేదీ నాడే కౌంటింగ్ జరగబోతోందని చెప్పారు. ఈ సారి ఎన్ని సీట్లకు చంద్రబాబు పరిమితం కాబోతున్నాడో ఈ పాటికి అర్థమై ఉంటుందని అన్నారు. ఈ లెక్కన టీడీపీ నాలుగు స్థానాలే దక్కబోతోన్నాయని, అందుకే చంద్రబాబు మీద జాలి వేస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications