బద్వేలులో వైసీపీ మెజార్టీ అంచనాలు- ఎంతో తేల్చేసిన నేతలు : లెక్క పక్కా అంటూ..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో బై పోల్ ముగిసింది. ఈ ఎన్నిక పైన సీఎం జగన్ ముందు నుంచి సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాడే అభ్యర్ధిని ఖరారు చేసారు. పార్టీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసారు. సీనియర్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని మండలాల బాధ్యత అప్పగించారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి మొత్తం ఉప ఎన్నిక బాధ్యతలను కేటాయించారు. దీంతో..వారంతా బద్వేలు లో తొలి రోజు నుంచి పూర్తి స్థాయిలో ఇంటింటి ప్రచారం చేసారు. ఈ ఎన్నికల్లో టీడీపీ..జనసేన పోటీ చేయలేదు. బీజేపీ - కాంగ్రెస్ మాత్రం వైసీపీతో పాటుగా ప్రధాన పార్టీలుగా బరిలో నిలిచాయి.

మెజార్టీ పైనే వైసీపీ ఫోకస్
జనసేన ఈ ఎన్నికల్లో మద్దతివ్వలేదు. అదే విధంగా టీడీపీ నేతల సేవలను బీజేపీ పోలింగ్ రోజున వినియోగించుకుందని..టీడీపీ నేతలే బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా పని చేసారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక, బీజేపీ సైతం వైసీపీ పైన ఆరోపణలు గుప్పించింది. బయట వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారంటూ ఫిర్యాదులు చేసారు. ఇక, బద్వేలులో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది వెంకట సుబ్బయ్య 45 వేల ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఈ సారి అంతకంటే ఎక్కువ రావాలని పార్టీ నేతలకు సీఎం జగన్ నిర్దేశించారు.

పోలింగ్ సరళి..లెక్కల్లో వైసీపీ
బద్వేలులోని ఓటర్లకు సీఎం స్వయంగా లేఖలు రాసారు. ఇక, ఈ సారి జరిగిన ఎన్నికల్లో 68.12 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో.. పోలింగ్ సరళి గురించి వైసీపీ నేతలు విశ్లేషణలు మొదలు పెట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఏజెంట్ల ద్వారా పూర్తి సమాచారం తెప్పించుకున్న నేతలు మండలాల వారీగా మెజార్టీ ఎంత వస్తుందనే దాని పైన అంచనాలు సిద్దం చేసుకుంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉప ఎన్నికలు జరిగే వాతావరణం ఉంటుంది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పైన ఉన్న కాస్తో కూస్తో వ్యతిరేకత సైతం ఈ ఉప ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉంది.

బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు
అయితే, సీఎం సొంత జిల్లా కావటంతో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఎన్నిక కావటంతో ఖచ్చితం గా మంచి మెజార్టీ వస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. టీడీపీ పోటీలో లేకపోవటంతో లోపాయి కారీగా జరిగిన ఒప్పందాలతో టీడీపీ ఓట్లు కొంత మేర బీజేపీకి బదిలీ అయినట్లుగా లెక్కలు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో టీడీపీకి 50 వేల ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 750 ఓట్లు మాత్రమే దక్కాయి.

వైసీపీ మెజార్టీ అంచనాలు - లెక్కలు
అయితే, ఈ సారి బీజేపీ తమ ఓటు బ్యాంకు పెంచుకోవటంతో పాటుగా..టీడీపీ నుంచి బదిలీ అయిన ఓట్లను కూడా కమలం ఖాతాలో జమ అయ్యాయి. ఇవన్నీ లెక్కలు వేసిన తరువాత వైసీపీ అభ్యర్ధికి దాదాపుగా లక్షా 40 వేలకు పైగా ఓట్లు పోలయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన వైసీపీ బద్వేలు బై పోల్ లో దాదాపుగా 90 వేల వరకు మెజార్టీ సాధిస్తుందంటూ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి అంచనా లు ఎంత వరకు నిజం అవుతాయో రెండు రోజుల్లో వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications