వైసీపీ నేతల నోటా జగన్ 175 మాట-ప్రయత్నిస్తామన్న బాలినేని-గ్రాఫ్ తగ్గడం వల్లే ఆ నిర్ణయం
ఏపీలో 2024 ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న వైసీపీకి తాజాగా అధినేత జగన్ కీలక దిశానిర్దేశం చేశారు. నిన్న ఏర్పాటు చేసిన పార్టీ నేతల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించలేమా అంటూ నేతల్ని ఆయన ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు వైసీపీతో పాటు మిగతా పార్టీల్లోనూ ఈ 175పై చర్చ జరుగుతోంది.
తాజాగా పార్టీ నేతల భేటీలో సీఎం జగన్ చేసిన 175 సీట్ల వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీ ప్రాంతీయ
సమన్వయకర్తగా కూడా ఉన్న బాలినేని శ్రీనివాసులురెడ్డి స్పందించారు. కొంత మంది ఎమ్మెల్యేలకి గ్రాఫ్ తగ్గడం వల్ల గడపగడపకీ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం చేయాలంటూ సీఎం జగన్ తమను ఆదేశించినట్లు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలకి టిక్కెట్టు ఇవ్వడం జరగదని కూడా జగన్ చెప్పినట్లు బాలినేని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అవకాశాలపై బాలినేని స్పందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా ప్రజలు, పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని తిరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే గతంలో ఓడిపోయిన సీట్లపైనా దృష్టి సారిస్తామన్నారు. గతంలో ఓటమిపాలైన కుప్పంతో పాటు ఇతర సీట్లపై వైసీపీ ఈసారి దృష్టిపెడుతున్న నేపథ్యంలో బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రాంతీయ సమన్వయ కర్త హోదాలో బాలినేని చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లే కనిపిస్తున్నాయి.
మరోవైపు తాజాగా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించని వైసీపీ సర్కార్ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపైనా బాలినేని స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో కేంద్రంలోని మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి మరింత భారం వేస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ గుర్తించాలని బాలినేని కోరారు.












Click it and Unblock the Notifications