మాచర్ల దాడి నిందితుడికి వైసీపీ బంపర్ ఆఫర్: మున్సిపల్ ఛైర్మన్ రేసులో: నేడు నామినేషన్?
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులపై గుంటూరు జిల్లా మాచర్లలో దాడి చేసిన ప్రధాన నిందితుడు తురకా కిశోర్‌కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తురకా కిశోర్ శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video


మాచర్లలో తిరుగులేని వైసీపీ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్లలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. మాచర్ల నియోజకవర్గం పరిధిలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 60 సీట్లను ఏకగ్రీవంగా తన ఖాతాలోకి వేసుకుంది వైఎస్ఆర్సీపీ. ఇదే తరహా ఫలితాలు మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో కూడా వెలువడొచ్చని అంటున్నారు. మాచర్ల మున్సిపాలిటీలో మెజారిటీ వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి వ్యూహాన్ని రచిస్తోంది.

వైసీపీకి కంచుకోటగా మాచర్ల..
నిజానికి- మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కంచుకోట. 2004 నుంచి కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఏకపక్షంగా మార్చేయడానికి ఆయన సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు. పోటీ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

పిన్నెల్లి కుడిభుజంగా..
ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఛైర్మన్ కుర్చీలో తురకా కిశోర్‌ను కూర్చోబెట్టాలని పిన్నెల్లి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇదివరకే ఖరారు చేశారనే వార్తలు కూడా ఉన్నాయి. పిన్నెల్లి ప్రధాన అనుచరుడనే పేరుంది తురకా కిశోర్‌కు. పైగా వైఎస్ఆర్సీపీ మాచర్ల పట్టణ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. స్థానికంగా తురకా కిశోర్‌కు మంచి పట్టు ఉందని, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన.. వంటి అంశాలపై అవగాహన ఉందని అంటున్నారు. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొన గలిగే సత్తా ఉందని చెబుతున్నారు. దీనితో ఆయనను మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని అప్పగిస్తే.. పార్టీ మరింత బలోపేతమౌతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నేడు నామినేషన్ వేసే ఛాన్స్..
తురకా కిశోర్ ప్రస్తుతం అరెస్టు అయ్యారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై బుధవారం మాచర్లలో చోటు చేసుకున్న దాడి తరువాత పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో తురకా కిశోర్ ఎలా నామినేషన్ వేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నామినేషన్లను దాఖలు చేయడానికి శుక్రవారమే చివరి రోజు. స్టేషన్ బెయిల్‌పై పోలీసులు ఆయనను విడుదల చేస్తారని, నామినేషన్ వేసిన అనంతరం మళ్లీ అదుపులోకి తీసుకుంటారని సమాచారం.












Click it and Unblock the Notifications