ఈ రెండున్నర నెలలను గట్టిగా వాడుకుంటోన్న జగన్
YS Jagan: దేశంలో ఎన్నికల నగారా మోగిన వేళ.. అన్ని పార్టీలు కూడా కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల యుద్ధంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి. దశలవారీగా అభ్యర్థుల జాబితాలనూ విడుదల చేస్తూ వస్తోన్నారు.
ప్రచార హోరు..
ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా నాలుగు చోట్ల బహిరంగ సభలను నిర్వహించింది. మలిదశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటోన్నారు.

కూటమి తొలి సభ..
అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి సభలో సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వేదికను పంచుకున్నారు.
మేనిఫెస్టోపై..
అదే సమయంలో- వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోకు కూడా తుది రూపాన్ని ఇస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో డ్రాఫ్ట్ సైతం పూర్తయినట్లు తెలుస్తోంది. దీనిపై వైఎస్ జగన్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. డ్రాఫ్టింగ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.
అందరినీ ఆకట్టుకునేలా..
ఈ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉండొచ్చని చెబుతున్నారు. నవరత్నాల తరహాలోనే సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని సామాజిక వర్గాలనూ ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. మహిళలు, రైతుల, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు.

మేనిఫెస్టో విడుదల వాయిదా?
నిజానికి- ఈ నెల 20వ తేదీన మేనిఫెస్టోను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం తొలుత భావించింది. దీనికి ఏర్పాట్లు సైతం పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సుమారు రెండున్నర నెలల గడువు ఉంది. నాలుగో దశలో అంటే మే 13వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ షెడ్యూల్ అయింది.
11 లేదా 12 తేదీల్లో..
ఈ రెండున్నర నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో మేనిఫెస్టో విడుదలను వాయిదా వేయాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ జరగడానికి సరిగ్గా వారం రోజుల ముందు అంటే.. ఏప్రిల్ 11 లేదా 12వ తేదీన విడుదల చేయాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications