మళ్లీ రాధాను దువ్వుతున్న వైసీపీ ? రంగా విగ్రహాలతో మైండ్ గేమ్ ! కాపునాడు భేటీ వేళ ?
ఏపీలో పొలిటికల్ గా అత్యంత యాక్టివ్ గా ఉండే విజయవాడ రాజకీయాల్లో మరోసారి దివంగత వంగవీటి రంగా హత్యతెరపైకి వస్తోంది. ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గంలో ఈ హత్యను తీవ్ర చర్చనీయాంశం చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందుకోసం వైసీపీ మొదలుపెట్టిన ఆటలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న రంగా తనయుడు రాధా తనకుతెలియకుండానే పావుగా మారిపోతున్నారు. రంగా విగ్రహావిష్కరణలు పెట్టడం, అక్కడ టీడీపీపై విమర్శలకు దిగడం ద్వారా రాధాను రెచ్చగొట్టి వైసీపీలోకి తిరిగి రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

మళ్లీ తెరపైకి రంగా హత్య
ఏపీ రాజకీయాల్ని మూడు దశాబ్దాల క్రితం ఓ కుదుపు కుదిపిన వంగవీటి రంగా హత్య ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. కానీ తమ రాజకీయాల కోసం దీన్ని ఉద్దేశవూర్వకంగా తెరపైకి తెస్తున్నవారూ లేకపోలేదు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్ధితులు మరోసారి కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న కార్యక్రమాలు, రంగా హత్యను తిరిగి కెలికి తమ రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే ఇందులో ఆయన కుమారుడు రాధా పావుగా మారిపోతుండటం చర్చనీయాంశమవుతోంది.

రంగా విగ్రహాలతో రాజకీయం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు వైఎస్సార్, ఎన్టీఆర్ విగ్రహాలతో పోటీగా రంగా విగ్రహాలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులోనూ వైసీపీ నేతలు వైఎస్సార్ విగ్రహాలతో పాటు రంగా విగ్రహాలనూ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ విగ్రహాలను ఆవిష్కరించేందుకు ఆయన కుమారుడు రాధాను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా వైసీపీలో ఉన్న కాపు నేతలు ఏర్పాటు చేస్తున్న రంగా విగ్రహాల ఆవిష్కరణలకు హాజరవుతున్నారు. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. ఈ విగ్రహావిష్కరణల సందర్భంగా టీడీపీని టార్గెట్ చేస్తూ వారు చేస్తున్న విమర్శలతో ఇక్కడ జరుగుతున్న రాజకీయం చర్చనీయాంశమవుతోంది.

రాధా ముందే టీడీపీపై విమర్శలు
రంగా విగ్రహావిష్కరణల సందర్భంగా పాల్గొంటున్న వైసీపీ నేతలు రంగా హత్య వ్యవహారాన్ని కెలుకుతున్నారు. రంగా హత్యకు టీడీపీ కారణమనే అంశాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. గతంలో రంగా కుమారుడు వంగవీటి రాధా టీడీపీలో చేరుతున్న సందర్భంగా పార్టీలో ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం పార్టీని నిందించలేమని చెప్పేశారు. తద్వారా టీడీపీలోకి ఆయన ఎంట్రీని సమర్ధించుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు రంగా విగ్రహావిష్కరణల సందర్భంగా రంగా హత్యలో టీడీపీ పాత్రను ప్రస్తావించడం ద్వారా రాధాను పరోక్షంగా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రాధా మాత్రం ప్రస్తుతానికి ఇదంతా నిశితంగా గమనిస్తూ మౌనంగా ఉండిపోతున్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేని పరిస్దితి.

వైసీపీ ట్రాప్ లో రాధా పడతారా ?
ప్రస్తుతం రాష్ట్రంలో కాపు రాజకీయాలు జోరందుకుంటున్నాయి.ఇందులో పార్టీలకతీతంగా అందరు కాపునేతలు ఏకమవుతున్నారు. విశాఖలో ఈ నెల 26న కాపు నాడు కీలక సభ ఉంది. ఇందులో వీరంతా పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ రాజకీయంలో వైసీపీలో కాపు నేతలు మాత్రం భాగస్వాములుగా లేరు. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న రంగా కుమారుడు రాధాను తమవైపు లాక్కోగలిగితే వీరందరికీ ఒకేసారి చెక్ పెట్టొచ్చనే ఉద్దేశంలో వైసీపీ కాపు నేతలు కనిపిస్తున్నారు. అందుకే రంగా హత్యలో టీడీపీ పాత్రను తెరపైకి తెస్తున్నారు. అయితే రాధా ఈ ట్రాప్ లో పడి టీడీపీకి దూరమవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

కాపునాడు భేటీయే కీలకం ?
విశాఖలో ఈ నెల 26న రాష్ట్రంలోని కాపునేతలంతా కలిసి కాపునాడు భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కాపులకు రాజ్యాధికారంపై చర్చించబోతున్నారు. అలాగే రాష్ట్రంలో తాజా పరిణామాలపైనా చర్చించబోతున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాధాను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే రాధా కాపునాడు భేటీకి హాజరైతే మాత్రం కచ్చితంగా వైసీపీ ప్లాన్ విఫలమైనట్లే. అలా కాదని కాపునాడు భేటీకి రాధా దూరంగా ఉంటే మాత్రం కచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీపైపు మొగ్గుచూపుతారని అనుకోవచ్చు. దీంతో కాపునాడు భేటీ కీలకంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications