చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పించాలి; ప్రజల సంతకాల లేఖతో వైసీపీ ఎమ్మెల్యే ఆనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యల దుమారం చిలికి చిలికి గాలివానగా మారి ఇప్పుడు వివాదం హస్తినకు చేరింది. పట్టాభి సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యటం, వైసిపి కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యాలయాలపై దాడులు చేయడం రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇక టిడిపి అధినేత చంద్రబాబు దాడి జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల నిరసన దీక్షకు దిగగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ జనాగ్రహ దీక్షలకు దిగి తీవ్రస్థాయిలో టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ పై ఉద్దేశపూర్వకంగానే దుర్భాషలు, కలెక్టర్ కు ఆనం ఫిర్యాదు
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని మండిపడిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ, చంద్రబాబును రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ప్రజాభిప్రాయం తో కూడిన సంతకాల సేకరణ చేపట్టిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి అందజేశారు. ఈ లేఖను గవర్నర్ కు పంపాలని ఆయన జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు
చంద్రబాబు నాయుడు రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా తీర్పును చంద్రబాబు నాయుడు గౌరవించటం లేదని, ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ తీరుకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి గవర్నర్ కు పంపించడం కోసం సంతకాల సేకరణ చేశామని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ నేతల దూకుడు
సభ్య సమాజం చంద్రబాబునాయుడు వైఖరిని తప్పు పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని టిడిపి నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ కేంద్రంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇక మరోవైపు వైసీపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడమే కాకుండా చంద్రబాబును రాజకీయాల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తున్నారు.

కలెక్టర్ కు సంతకాల ప్రతిని అందించి గవర్నర్ కు ఫిర్యాదు
ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పట్టాభి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ నోటికి వచ్చినట్టుగా తిట్టాడని, పదేపదే బూతు మాటలతో జగన్ ను దుర్భాషలాడారని, చంద్రబాబు ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వకంగానే జగన్ పట్ల అసభ్య కరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయాడని పేర్కొన్న ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలా దిగజారిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. ఒక పార్టీ అధినేతగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సమర్ధనీయం కాదని పేర్కొన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. పట్టాభి లాంటి వారిని ప్రోత్సహిస్తున్న ఆయనను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాలని డిమాండ్ చేస్తూ తన విజ్ఞాపన పత్రంతో పాటుగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతిని కలెక్టర్ కు ఇచ్చారు. దానిని గవర్నర్ కు పంపాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications