ఆయన మనిషే కదా..?: బాలయ్యపై వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్ అటాక్
తనపై విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై నరసరావుపేటకు చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎదురుదాడికి దిగారు.
అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఉగ్రావతారం ఎత్తారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను మూర్ఖుడిగా అభివర్ణించారు. యథా రాజ తథా ప్రజ అన్నట్లు వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. సినిమాలను సినిమాలుగా మాత్రమే చూడాలని సూచించారు.
నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఇటీవలే ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇందులో భాస్కర్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త నందమూరి బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని పాటను ప్లే చేశారు. ఇది గోపిరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. బాలకృష్ణ పాట వేయొద్దంటూ ఆదేశించారు. దాన్ని తొలగించాలని సూచించారు. ఇది బాలకృష్ణ దృష్టికి వెళ్లింది.
దీనిపై బాలకృష్ణ స్పందించారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సినిమాలను సినిమాగా చూడాలని సూచించారు. ఇందులో రాజకీయాలను జొప్పించకూడదని అన్నారు. సినిమా అనేది ఏ కులానికో, మతానికో సంబంధించినది కాదని చెప్పారు. సినిమాలను అందరూ చూస్తారని, అన్ని కులాలవారు, మతాలవారిని ఒకేచోటికి చేర్చే శక్తి సినిమాకు ఉందని పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని సినిమా ప్రపంచం ఏకం చేస్తుందని వ్యాఖ్యానించారు.
నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి బాలయ్య మాస్ వార్నింగ్#Narararaopet #balakrishna #oneindiatelugu pic.twitter.com/qzIx098blc
— oneindiatelugu (@oneindiatelugu) March 15, 2023
బాలకృష్ణ చేసిన విమర్శలను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. తాను మూడోకన్ను తెరిస్తే అంటూ బాలకృష్ణ చెప్పడాన్ని తప్పుపట్టారు. మనిషికి రెండు కళ్లే ఉంటాయని, మూడో కన్ను ఉండదని గోపిరెడ్డి అన్నారు. బాలకృష్ణ కూడా మనిషేనని, తనకు తానుగా ఏవేవో ఊహించుకుంటే కుదరదని విమర్శించారు. ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం సరికాదని అన్నారు.

రాజకీయాలంటే సినిమాల్లో నటించినంత సులభం కాదని, తాను సినిమా హీరోనంటూ ఊహించుకుని తోటి శాసన సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడ కూడదని హితవు పలికారు. వాస్తవాలేమిటనేది తెలుసుకుని మాట్లాడాలని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని సూచించారు. ఆ కార్యక్రమంలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పారు. ఎవడో తాగుబోతోడు చెప్పిన మాటలను నమ్మడమేనా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications