వైసీపీ ఎమ్మెల్యే మెడలో టీడీపీ కండువా
Kolusu Parthasarathy: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.
ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, డాక్టర్ సంజయ్ కుమార్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు.

ఇదే క్రమంలో తాజాగా వైఎస్ఆర్సీపీలో మరో బిగ్ వికెట్ పడింది. ఊహించినట్టే- వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీ మారారు. తెలుగుదేశం కండువాను కప్పుకొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
ఈ ఎన్నికల్లో పార్థసారథికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం. ఈ స్థానాన్ని మంత్రి జోగి రమేష్‌కు కేటాయించింది. ఈ కారణంతో ఇదివరకే ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు.

జిల్లాలోని నూజివీడు టికెట్ పార్థసారథికి ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీనితో కొద్దిసేపటి కిందటే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు బొప్పన భవకుమార్, తుమ్మల చందుతో కలిసి టీడీపీ కండువాను కప్పుకొన్నారు.
2019 నాటి ఎన్నికల్లో బొప్పన భవకుమార్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడీ సీటులో వైఎస్ఆర్సీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో బొప్పన.. పార్టీకి గుడ్ బై చెప్పారు.












Click it and Unblock the Notifications