ఇవాళ టీడీపీలోకి ఆ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే-ఇప్పటికే టికెట్ ప్రకటన..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో చేరికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు ఓవైపు, టీడీపీ జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదల మరోవైపు పూర్తయింది. దీంతో ఇరు చోట్లా టికెట్లు దక్కని వారు ప్రత్యర్ధి పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. ఇదే క్రమంలో పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్దసారధి.. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో చోటు దక్కకపోవడంతో టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇవాళ ఆయన అధికారికంగా టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో పెనమలూరు నుంచి తనకు బదులుగా మంత్రి జోగి రమేష్ ను అధిష్టానం ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పార్ధసారధి పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మారితే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో ఆచితూచి వ్యవహరించారు. అయితే టీడీపీ రాజ్యసభ ఎన్నికల బరిలో లేదని తేలిపోవడంతో పార్టీలో చేరేందుకు ముహుర్తం సిద్ధం చేసుకున్నారు.

అయితే వైసీపీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయనప్పటికీ నూజివీడులో టీడీపీ ఇన్ ఛార్జ్ గా కొలుసు పార్ధసారధి పేరును చంద్రబాబు అధికారికంగానే ప్రకటించేశారు. అంతే కాదు పార్దసారధికి తాజాగా విడుదల చేసిన టీడీపీ జనసేన తొలి జాబితాలోనే సీటు కూడా దక్కింది.
అయినా ఇప్పటికీ ఆయన వైసీపీకి అధికారికంగా రాజీనామా చేయకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు. తొలిసారి నియోజకవర్గం మారి ఆయన పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications