ఫ్యాన్ గుర్తుకు ఓటు... లేదంటే ఫింఛను కట్!!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన సమయంలో ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని, లేదంటే పింఛన్లు ఆగిపోతాయని స్థానికులను హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నవరంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగే క్రమంలో ఆయన మహిళలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇళస్థలాలుకానీ, పింఛన్లుకానీ అన్నీ జగన్ ప్రభుత్వంలో వచ్చినవేనని, అందరూ జగన్ కే ఓటువేయాలని కోరారు. మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జనవరి నుంచి రూ.2750 పింఛను ఇస్తామని, ఆ తర్వాత మూడువేల రూపాయలకు పెంచుతామన్నారు. ఇప్పటివరకు ప్రజలకు లక్షా 71 వేల 244 కోట్ల రూపాయలను ప్రజలకు నేరుగా పంపిణీ చేశామని పూర్ణచంద్రప్రసాద్ వెల్లడించారు.

మహిళల కోసం నాలుగు పథకాలకు 39 నెలల్లో రూ. 51 వేల కోట్లు ఇచ్చామని, బడ్జెట్ ఎలా ఉన్నా పథకాలు మాత్రం అమలు చేస్తున్నామన్నారు. దోచుకో.. దాచుకో.. తినుకో పథకాలను చంద్రబాబు అమలుచేసేవారని విమర్శించారు. ఒంటరి మహిళలు పింఛను పొందేందుకు ఉన్న అర్హతను ప్రభుత్వం సవరించింది. వారి వయసును 50 సంవత్సరాలకు పెంచింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 30 సంవత్సరాలు, పట్టణాల్లో అయితే 35 సంవత్సరాలు అర్హతగా ఉండేది. ఇతరత్రాఏదైనా పింఛన్లు పొందుతుంటే ఈ పింఛను ఆపేస్తారు. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే దుమారం రేపుతోంది. ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర విషయాలజోలికి వెళ్లవద్దని సమావేశం జరిగిన ప్రతిసారీ జగన్ మంత్రులను, ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications