పవన్ కల్యాణ్‌కు మెగా ఆఫర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
కడప: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా స్పందిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభల్లో చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తాను ఎమ్మెల్యేని కాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. పవన్‌ను తాను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. ధైర్యం ఉంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. పవన్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వకుండా ఆపగలిగే శక్తి తానేనవుతానని సవాల్ విసిరారు.

ఈ మధ్యాహ్నం ఆయన ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననే ఫేస్ వ్యాల్యూ తనకు ఉందని పవన్ కల్యాణ్ భావిస్తోన్నాడని, ప్రొద్దుటూరులో పోటీ చేయాలని సాదరంగా ఆహ్వానిస్తున్నానని రామచల్లు అన్నారు. ఎవరు గెలుస్తారో.. ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తాను ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తానని, దమ్ము ధైర్యం, గెలుస్తాననే నమ్మకం ఉంటే తనపై పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తున్నానని రాచమల్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ జెండా నీడలో ఏ నియోజకవర్గం నుంచి ఎవ్వరు పోటీ చేసినా పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోరని అన్నారు.
175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని పవన్ కల్యాణ్..ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నించారు. ఒకరోజు తాను సీఎం రేసులో లేనని, మరో రోజు తానే సీఎం అని చెప్పుకొంటూ రోజుకో మాట మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంచల మనస్తత్వాన్ని కలిగిన పవన్ కల్యాణ్ రాజకీయాలకు అన్ ఫిట్ అని రాచమల్లు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కాకుండా తనను ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తానంటూ సవాల్ చేయాల్సింది పోయి ఎమ్మెల్యే అయితే చాలనే అభిప్రాయంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications