వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు నల్లేరు మీద నడకేనా?
Kesineni Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కల్లోలం చోటు చేసుకుంటోంది. పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి ప్రతికూలంగా తయారవుతున్నాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.
విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు.

అదే సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బంపర్ ఆఫర్‌ను అందుకున్నారుకేశినేని నాని. ఏ విజయవాడ లోక్‌సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారో.. అదే విజయవాడ లోక్‌సభ బరిలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతోన్నారు. మూడో జాబితాలో ఆయన పేరును కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు.
విజయవాడ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు కేశినేని నాని. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రసాద్ వీ పొట్లూరిపై 8,726 ఓట్ల స్వల్ప తేడాతో నెగ్గారు. ఇక మూడోసారి గెలుపుపై దృష్టి సారించారు కేశినేని. ఆయన గెలుపు బాధ్యతలను విజయవాడ వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకున్నారు.
ఈ క్రమంలో- ఈ ఉదయం విజయవాడకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన ఇంటికి బారులు తీరారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్, ఆయన భార్య సుధారాణి, పలువురు కార్పొరేటర్లు.. నానిని కలిశారు. శుభాకాంక్షలు తెలిపారు.

కేశినేని నానిని తాము మళ్లీ గెలిపించుకుంటామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో ఆయన మూడోసారి లోక్‌సభలో అడుగుపెడతారని అన్నారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి కానివ్వకుండా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూరకంగా అడ్డుకున్నారని, నిధులన్నింటినీ అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మళ్లించారంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications