బికినీ షోలు పెట్టి..అదే ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ఎలా: అచ్చెన్న ఓ గంగిరెద్దు: వైసీపీ నేత
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలను సంధించారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు.. అమరావతి అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టారని, అది కూడా పూర్తి చేయలేక చేతులెత్తేశారని ఆరోపించారు. అమరావతి డిజైన్ల కోసమే అయిదు సంవత్సరాల పాటు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు.

అసెంబ్లీ సాక్షిగా..
ఈ ఉదయం ఆయన తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. శ్రీకాకుళంలో కూడా ప్రాజెక్టులను నిర్మించామని నిండు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేయగా.. ఏ ప్రాజెక్టు అని స్పీకర్ తమ్మినేని సీతారాం అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలాడని ఎద్దేవా చేశారు. ఇలా కేవలం మాటలు, ప్రచారాలతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసినట్లుగా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎందుకు?
చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేయలేనిది..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లలోనే చేసి చూపించారని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎన్నో ప్రాజెక్టులు ప్రకటించారని చెప్పారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదకా 11 వైద్య కళాశాలు మాత్రమే ఉంటే.. ముఖ్యమంత్రి ఒక్క క్లిక్‌తో కొత్తగా 16 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఉత్తరాంధ్రకు రెండు మెడికల్ కాలేజీలు రావడం చరిత్ర అని అన్నారు. అనకాపల్లి, పాడేరుల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు.

వంశధార, నాగావళి అనుసంధానం..
ఉద్దానం కిడ్నీ సమస్యను తీర్చడానికి సుమారు 750 కోట్ల రూపాయలతో హిరమండలం రిజర్వాయర్ నుంచి మంచినీటిని సరఫరా చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారని గుర్తు చేశారు. పలాసలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కిడ్నీ సేఫ్టీ ఆసుపత్రి, 250 పడకలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వంశధార, నాగావళి అనుసంధానం కోసం ఉద్దేశించిన కాల్వ పనులను కూడా ప్రభుత్వం పూర్తి చేస్తోందని చెప్పారు.

విశాఖపట్నం రాజధానిగా అడ్డుకుంటోన్నది ఎవరు బాబు?
ఏపీ-ఒడిశా సరిహద్దులో నేరడి బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోందని పేర్కొన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు భావనపాడు పోర్టు గురించి ఏ ఒక్కరోజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే.. దాన్ని అడ్డుకుంటోన్నది చంద్రబాబు కాదా? అని దువ్వాడ శ్రీనివాస్ నిలదీశారు. తెలుగు దొంగల పార్టీకి హఠాత్తుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి గుర్తుకు వచ్చిందని, ఓ గంగిరెద్దు అధ్యక్షతన సమావేశం పెట్టారని మండిపడ్డారు.

ఇప్పుడు గుర్తుకొచ్చిందా?
14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రను పట్టించుకోని చంద్రబాబు నాయుడు, తెలుగు దొంగల పార్టీ నేతలకు హఠాత్తుగా ఈ ప్రాంత అభివృద్ధి గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు రెండున్నరేళ్లు నిద్రపోయి ఇప్పుడు గంగిరెద్దులా రంకెలు వేస్తున్నారని విమర్శించారు. అర్జెంట్‌గా పార్టీ అధికారంలోకి రావాలని అచ్చెన్నాయుడు కలలు కంటున్నారని, అవి పగటి కలలేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యమని పేర్కొన్నారు.

బికినీ షోలతో అభివృద్ధా?
పోలవరం పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ముఖ్యమంత్రిపై మాట తూలుతున్నాడని, తన భాషను మార్చుకోకపోతే.. అంతకంటే దారుణమైన భాషను తాము కూడా ప్రయోగించగలమని హెచ్చరించారు. విశాఖ అంటే సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, అలాంటి నగరాన్ని బికినీల షోగా మార్చాలని చూసింది చంద్రబాబే అని దువ్వాడ శ్రీనివాస్ గుర్తు చేశారు. బికినీ షోలు చేసి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ నేతలను గుడ్డలూడదీసి కొట్టి ఉండేవాళ్లని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత వ్యక్తిగా, వైసీపీ కార్యకర్తగా ఈ ప్రాంత అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, టీడీపీ నేతలకు చర్చకు వచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications