అసెంబ్లీ వేళ వైసీపీకి బిగ్ షాక్..! ఇవాళ టీడీపీలోకి మరో ఎమ్మెల్సీ..!
ఏపీలో గతేడాది ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి ఏదీ కలిసి రావడం లేదు. అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన నేతలతో పాటు పదవులు రాక అసంతృప్తిలో ఉన్న నేతలు సైతం ఆ పార్టీని వీడి కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే ఇలా పలువురు నేతలు టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇదే క్రమంలో ఇవాళ వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఒకరు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
గతంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తే అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ నేత, ప్రస్తుత పల్నాడు జిల్లా నేత మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీ గత వైసీపీ ప్రభుత్వంలో నెరవేరలేదు. మర్రి రాజశేఖర్ కు అతి కష్టం మీద చివర్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సరిపెట్టారు. వైసీపీ ఓటమి తర్వాత చిలకలూరిపేట వ్యవహారాలు చూసుకునేలా బాధ్యతలు ఇచ్చారు.

అయితే అదే చిలకలూరి పేట నుంచి వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన విడదల రజనీకి గత ఎన్నికల్లో గుంటూరు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. ఆమె అక్కడ ఓడిపోయాక తిరిగి చిలకలూరిపేటకు ఇన్ ఛార్జ్ గా పంపేశారు. దీంతో చిలకలూరిపేటపై ఆశలు పెట్టుకున్న మర్రి రాజశేఖర్ పరిస్ధితి మరోసారి అగమ్యగోచరంగా మారింది. దీంతో ఆయన తాజాగా వైసీపీకి, ఆ పార్టీ నుంచి లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే మర్రి రాజశేఖర్ రాజీనామా ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అధికార టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. దీంతో ఆయనకు ఇవాళ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైస్సార్సీపీ లో సుదీర్ఘ కాలం గా పని చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు అక్కడ తగిన గుర్తింపు రాకపోవడం, అధినేత జగన్ తీరు నచ్చకపోవడంతో టీడీపీలో చేరుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications