వైసీపీకి మరో బిగ్ షాక్- మరో ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై..!
వైసీపీకి ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుసగా ప్రజా ప్రతినిధులు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ ను కలిసి వారు తమ రాజీనామాలు సమర్పించారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేయగా.. ఇవాళ ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టడం కలకలం రేపుతోంది.

బల్లి కళ్యాణ చక్రవర్తి మండలిలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ కాగా.. కర్రి పద్మశ్రీ గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ. వీరిద్దరూ వైసీపీ హయాంలో ఎమ్మెల్సీలు అయిన వారే. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారడంతో వీరిద్దరూ వైసీపీకీ, తమ ఎమ్మెల్సీ సభ్యత్వాలకూ రాజీనామాలు చేశారు. ఇవాళ మండలి ఛైర్మన్ కు రాజీనామాలు సమర్పించిన వీరిద్దరూ టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు చర్చలు సాగించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఇప్పుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామాలతో వీరి సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం మండలిలో అధికార కూటమికి బలం లేదు. దీంతో మండలిలో బిల్లులు నెగ్గించుకోవడం కష్టం. అందుకే వైసీపీ ఎమ్మెల్సీలను ఒక్కొక్కరిగా రాజీనామాలు చేయించి తిరిగి నెగ్గించుకోవడమో లేక నామినేట్ చేయించడమే చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications