ఆ వైసీపీ ఎంపీ రాకతో టీడీపీలో ఎన్ని మార్పులో తెలుసా ?
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు సొంత పార్టీతో పాటు విపక్ష పార్టీల్లోనూ పెను ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీలో టికెట్లు దక్కని వారు విపక్షపార్టీల్లోకి ఫిరాయిస్తుండటం, అక్కడ అప్పటికే టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారు అభ్యంతరాలు చెప్పడం, అసంతృప్తులు వ్యక్తం చేయడం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఓ వైసీపీ ఎంపీ రాక టీడీపీలో పెను మార్పులకు దారి తీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓ కీలక ప్రాంతంలో టీడీపీ రాజకీయంలో బిగ్ టర్న్ తెచ్చేలా ఉంది.
రాష్ట్రంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీట్లు కోల్పోయిన ఎంపీల్లో నరసరావుపేట నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకరు. సిట్టింగ్ సీటు నరసరావుపేటను ఈసారి బీసీలకు కేటాయిస్తున్నందున గుంటూరులో పోటీ చేయాలని సీఎం జగన్ చేసిన సూచన రుచించకపోవడంతో లావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో లావు టీడీపీలో చేరిక పల్నాడు ప్రాంతంలో ఆ పార్టీ రాజకీయాల్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది.

లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఖాయమైంది. అదే సమయంలో పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. వీరిద్దరు టీడీపీలో చేరుతున్న ప్రభావం ఇప్పుడు గురజాల అసెంబ్లీ సీటుపైనా పడింది. టీడీపీలో చేరాక తిరిగి నరసరావుపేట నుంచే ఎంపీగా బరిలోకి దిగేందుకు లావు కృష్ణదేవరాయుల సిద్ధమవుతుండగా.. గురజాల, నరసరావుపేట అసెంబ్లీ సీట్లపైనా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.
మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి.. 2019 ఎన్నికల సమయంలో గురజాల సీటు నుంచి పోటీకి సిద్ధం కాగా.. అప్పట్లో కాసు మహేష్ రెడ్డికి ఈసారికి అవకాశం ఇస్తామని, 2024లో మీరు పోటీ చేయాలని జగన్ సూచించడంలో వెనక్కి తగ్గారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్దితి లేకపోవడంతో టీడీపీలో చేరుతున్నారు. దీంతో అక్కడ ఇన్ ఛార్జ్ యరపతినేని శ్రీనివాసరావును కాదని జంగాను గురజాల నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ సిద్దమవుతోంది. అలాగే యరపతినేనిని నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై బరిలోకి దింపనున్నారు. అలాగే మరికొన్ని మార్పులు కూడా లావు శ్రీకృష్ణదేవరాయుల కోరిక మేరకే జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications