గెలిచే సత్తాలేకనే హత్యాయత్నం.. అలా చెయ్యాలని చూస్తే సహించం: ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరిక!
ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచే సత్తా లేక కూటమి నాయకులు తనపై హత్యాయత్నానికి దిగారని ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దాడులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం ద్వారా ఎన్నికలు జరిపాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. గత మూడు, నాలుగు రోజులుగా బయట ప్రాంతాల నుంచి రౌడీలు, గూండా ముఠాలను తీసుకొచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారని, చైర్మన్ అభ్యర్థిని తీసుకెళ్తున్న సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, పలు వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలవనీయకుండా భయపెట్టే ప్రయత్నాలు సాగనివ్వబోమని ఇకపై హెచ్చరించారు.

కున్నూరు ప్రాంతంలో సాధారణంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల్లోఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను సమీకరించి గొడవలు సృష్టిస్తున్నారన్నారు. సుమారు 50 మంది వరకు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల ప్రోద్బలంతోనే బయట ప్రాంతాల నుంచి వ్యక్తులను సమీకరించి దాడులకు ప్రణాళిక రచించారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లినప్పటికీ రిటర్నింగ్ అధికారి వాటిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. తమపై పైస్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని, నామినేషన్లు స్వీకరించలేమని ఆర్ఓ చెప్పారు. నామినేషన్లు తీసుకోవడంతోపాటు కనీసం స్వీకరణకు సంబంధించిన రసీదు లేదా ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
దాదాపు మూడు గంటలపాటు అక్కడే వేచి ఉన్నప్పటికీ ఆరు నామినేషన్లను కూడా స్వీకరించని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసే ప్రాథమిక హక్కును కూడా అడ్డుకుంటే ఎన్నికలు నిర్వహించడంలో అర్థం ఏముంటుంది..? అని ప్రశ్నించారు.
ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. దానికి బదులుగా ప్రత్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, పత్రాలు లాక్కోవడం, దాడులు చేయించడం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందన్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలపై పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతామని ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించాలని చూడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని చంద్రబాబు, లోకేశ్ గుర్తు పెట్టుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరింపులకు వెనుకాడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
