కాక్రోచ్ ల తిరంగా మార్చ్ పై ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం-జూలై 20 రిపీట్ కాకుండా..!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో వరుస నిరసనలు నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇవాళ కన్నాట్ ప్లేస్ లో 'లెహ్రా దో తిరంగా ' మార్చ్ చేపట్టబోతోంది. ఈ మార్చ్ నిర్వహించవద్దంటూ ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఇప్పటికే సీజేపీ ఛీఫ్ అభిజీత్ దిప్కేకు నోటీసులు ఇచ్చారు. అయినా కాక్రోచ్ లు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి కీలక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
కన్నాట్ ప్లేస్లో 'లెహ్రా దో త్రిరంగా' మార్చ్ సందర్భంగా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించబడకుండా, డా శాంతిభద్రతలు చెక్కుచెదరకుండా చూసుకుంటూనే, తమ సిబ్బంది గరిష్ట సంయమనం పాటిస్తారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా జూలై 20 నాటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఇందుకోసం న్యూఢిల్లీ ప్రాంతమంతటా 6 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని, 220 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)ను మోహరించినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.

జూలై 20న నీట్ పేపర్ లీక్ వివాదంపై సెంట్రల్ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారింది. ఇందులో నిరసనకారులతో జరిగిన ఘర్షణల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడగా, సుమారు 60 మంది నిరసనకారులు గాయపడినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. .ఇప్పుడు కన్నాట్ ప్లేస్ లో ఎన్డిఎంసి సెంట్రల్ పార్క్ను మూసివేసిన నేపథ్యంలో.. నిరసనకారులు తమ ఆదేశాలు ఉల్లంఘించబడకుండా పోలీసులు చూసుకుంటారని అధికారులు తెలిపారు. నిరసనకారులకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక చిన్న బృందాన్ని నిర్దేశిత ప్రదేశంలో జాతీయ జెండాతో కవాతు చేయడానికి అనుమతించవచ్చని వారు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ ప్రదర్శన సందర్భంగా శాంతిభద్రతలను కాపాడటానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కవాతు దృష్ట్యా కన్నాట్ ప్లేస్ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపులు కూడా అమలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తారు.














Click it and Unblock the Notifications
