ఢిల్లీలో లెక్కలు తప్పుతున్నాయా ? 27వేల CAPF జవాన్లపై కేంద్రానికి పోలీసుల రిక్వెస్ట్..!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో విపక్షాలు, విద్యార్దులు, కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిన నిరసనలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అటు నిరసనకారులు, ఇటు కేంద్రం ఇద్దరూ ఎవరికి వారే మొండిపట్టు పట్టడంతో ఈ ప్రతిష్టంభన అంతకంతకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో నిరసనకారుల్ని అడ్డుకునేందుకు కేంద్రం పంపిన 27 వేల మంది సీఏపీఎఫ్ (CAPF) బలగాల విషయంలో ఢిల్లీ పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో గత వారం నిరసనలు ప్రారంభానికి ముందే 27 వేల మంది సాయుధ బలగాలను కేంద్రం మోహరించింది. అయితే ఇంకా 2800 మంది అదనంగా వచ్చి వీరితో జత కలవాల్సి ఉంది. రాజధానిలో ఆందోళనలు శాంతించకపోవడం, ఎప్పటివరకూ కొనసాగుతాయో తెలియని పరిస్దితులు ఉండటంతో ఈ 27 వేల మందిని అక్టోబర్ 20 వరకూ కొనసాగించాలని కేంద్రాన్ని ఢిల్లీ పోలీసులు కోరారు. జాతీయ రాజధానిలో ప్రస్తుతం ఉన్న 273 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపును అక్టోబర్ 20 వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కేంద్రానికి ఓ లేఖ రాశారు. రాజధాని వ్యాప్తంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు మోహరింపు కాలాన్ని అక్టోబర్ 12 తర్వాత కూడా పొడిగించాలని హోం శాఖకు రాసిన లేఖలో, ఢిల్లీ ఆపరేషన్స్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం అభ్యర్థించింది.

అక్టోబర్ 12 నాటికి కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసులకు మొత్తం 301 CAPF కంపెనీలను సమకూర్చింది. వీటిలో 221 కంపెనీలకు అక్టోబర్ 6 నాటి హోంశాఖ ఆదేశాల ద్వారా ఆమోదం లభించగా, మరో 80 కంపెనీలకు అక్టోబర్ 8న ఆమోదం లభించింది. కాక్రోచ్ జనతా పార్టీ' , ఇతర సంస్థలకు చెందిన కార్యకర్తలు చేపట్టే ర్యాలీలు, నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందుతున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు బలగాల కొనసాగింపు అభ్యర్థన చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ భవనం, ఇండియా గేట్, అలాగే మంత్రుల కార్యాలయాలు, నివాసాల వంటి ఇతర కీలక ప్రాంతాల వద్ద కూడా నిరసనకారులు భారీగా గుమిగూడే ప్రయత్నం చేయవచ్చని, తద్వారా శాంతిభద్రతల సమస్యలు తలెత్తవచ్చని ఢిల్లీ పోలీసులు కేంద్రాన్ని హెచ్చరించారు. భీమ్ ఆర్మీ, విద్యార్థి సంఘాలతో సహా ఇతర రాజకీయ సమూహాలు, సంస్థల కార్యకర్తలు ఇందులో పాల్గొనే అవకాశం ఉందని, అలాగే సామాజిక వ్యతిరేక శక్తులుగా భావిస్తున్న వర్గాల నుండి కూడా నిరసనలు వచ్చే అవకాశం ఉందని ఆ లేఖలో ప్రస్తావించారు.














Click it and Unblock the Notifications
