నక్కతోక తొక్కిన చాయ్ వాలా.. లక్కీ డ్రాలో బార్ గెలుపు!
కొంతమంది జీవితాలలో ఊహించని సంఘటనలు జరుగుతాయి, అదృష్టలక్ష్మి ఊహించని విధంగా వరిస్తుంది. అప్పటివరకు కటిక దరిద్రం అనుభవించిన వ్యక్తి ఒక్కసారే బోలెడు సంపదలను చూస్తారు. ఇది సినిమాలలో మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. ఎందుకంటె ఇది నిజ జీవితంలో కూడా జరుగుతుంది. ఇక అటువంటి ఘటన ములుగు జిల్లాలో జరిగింది.
అదృష్టం అంటే ఇలా ఉండాలనిపించే ఘటన ములుగు జిల్లాలో జరిగింది. హనుమకొండ బస్టాండ్ సమీపంలో చిన్న టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వల్లపు వెంకటేష్‌కు లక్కీ డ్రా ద్వారా బార్ అండ్ రెస్టారెంట్ దక్కింది. ఇది స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ములుగు జిల్లా కేంద్రంలోని నూతన మున్సిపాలిటీ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ హక్కు కోసం ఆబ్కారీ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది.

బార్ అండ్ రెస్టారెంట్ కోసం మొత్తం 376 మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది పెద్ద మొత్తాలు కట్టి పోటీలో ఉన్నారు. కానీ వెంకటేష్ తన దగ్గరున్న డబ్బుతో రూ. లక్ష మాత్రమే చెల్లించి ఒక్క దరఖాస్తు వేశాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకున్న వెంకటేష్ కు నిజంగానే లక్ అన్ లాక్ అయ్యింది. లక్కీ డ్రాలో అతని పేరు వచ్చింది. ఇన్నాళ్లూ టీ అమ్ముకుంటూ రోజువారీ జీవనం సాగిస్తున్న వెంకటేష్‌కు ఒక్కసారిగా బార్ దక్కడం ఆనందంతో పాటు భావోద్వేగానికి గురయ్యాడు.
తనకు బార్ అండ్ రెస్టారెంట్ వచ్చిందన్న వార్త తెలిసిన తర్వాత ఆయన కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. బార్ కోసం పోటీపడిన కొందరు ఇప్పుడు వెంకటేష్‌కు వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నారు. కొందరు భాగస్వామ్యం కోరుతుండగా, మరికొందరు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఆబ్కారీ శాఖ ద్వారా జరిగే లక్కీ డ్రా విధానంలో ఇలాంటి అనూహ్య విజయాలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. సాధారణ మనిషి ఒక్కసారిగా పెద్ద అవకాశం సొంతం చేసుకున్న ఈ కథ ములుగు, హనుమకొండ ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేష్ ఇప్పుడు బార్‌ను ఎలా నడుపుతాడో, దాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
