జగన్ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికారుల అత్యుత్సాహం కారణంగా ప్రభుత్వం అప్రతిష్టపాలవుతోందని, అధినేత దృష్టిలో పడేందుకు సదరు అధికారులు చేస్తోన్న పిచ్చి పనులు వల్ల అధికార పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. వైసీపీ నేతల వీరంగాలు, బలవంతపు రక్త దానాలు, భూదోపిడీలు, తప్పుడు పనుల వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరువు గంగలో కలిసిపోతున్నదని విమర్శించారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న ఎంపీ బుధవారం సోషల్ మీడియా వేదికగా ''మినీ రచ్చబండ'' కార్యక్రమంలో మాట్లాడారు. ఎంపీ రఘురామ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

చెంప పగిలినా బుద్ది రాలేదు
‘‘అందరిచేత జగనన్న అని బలవంతంగా పిలిపించుకునే వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మహిళా పోలీసులకు అందించిన ద్విచక్ర వాహనాలకు వైసీపీ పార్టీ రంగులు వేశారు. పోలీస్ అధికారులు ప్రభుత్వానికి పనిచేస్తారుగానీ అధికార పార్టీకి కాదు. ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్సయ్యారు? ఎవరి అడుగులకు మడుగులు వత్తడానికి సదరు అధికారులు తమ బాధ్యతను విస్మరించారు? ప్రభుత్వ వాహనాలకు పార్టీ రంగులు వేయడం తప్పు. గతంలోనూ ఇలాంటి తప్పులే చేస్తే సుప్రీంకోర్టు మావాళ్ల చెంప ఛెళ్లుమనిపించింది. అయినాకూడా వైసీపీకి బుద్ధిరాలేదు. వెంకయ్య నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజమండ్రిలో నిర్మించిన ఇళ్లకు కూడా వైసీపీ రంగులు వేసే దుస్సాహసానికి ఒడిగట్టారు.
మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాక

రంగు పడటం ఖాయం..
అధికారులు చేసే వెధవ పనుల వల్ల, అధినేత మనసు దోచుకోవాలనే వెర్రి ఆలోచనలో చేసే పిచ్చి చేష్టల వల్ల మా పార్టీ పరువు, అధ్యక్షుడు జగన్ పరువు గంగలో కలిసిపోతోంది. రంగులకు సంబంధించి ఇప్పటికే ఒక పిటిషన్ కోర్టులో ఉంది. ఆ కేసును విచారించిన జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ పై వైసీపీ శ్రేణులు ఇష్టారీతిగా విమర్శించారు. ఆ కామెంట్లను భరించలేక, ఎలాగో జనవరి నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు కాబట్టి రంగులకు అయిన ఖర్చుల వివరాలను కోర్టుకు ఇవ్వాలని, విచారణ మరో బెంచ్ చూస్తుందని జడ్జి రాకేశ్ చెప్పారు. ఏది ఏమైనా జగన్ కు రంగు పడటం ఖాయం. ఎన్నిరకాలుగా న్యాయమూర్తిని నిందించినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.
కరోనా వ్యాక్సిన్లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?

వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి?
ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదానికి రంగులు వేసుకుంటూ పోతుంటే అప్రతిష్ట ఎవరికి? వైసీపీ రంగులు వేసినందుకుగానూ ఆ డబ్బుల్ని పార్టీనే చెల్లించాలని కోర్టులు అంటున్నాయి. మరి పార్టీ డబ్బులు ఎలా కడుతుంది? అసలు మా పార్టీ దగ్గరున్న డబ్బులెన్ని? ఏదో మొన్ననే ఆ శేఖర్ రెడ్డి(టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు) ఓ రెండున్నర కోట్లిచ్చాడు. ఇంకొందరు రెడ్డి పారిశ్రామిక వేత్తలు అంతో ఇంతో ఇస్తే మొత్తం కలిపి రూ.8.5కోట్లు వచ్చాయి. రంగులు వేసినందుకు వెయ్యి కోట్లు కట్టమంటే వైసీపీ ఏమైపోవాలి? అధికారులు చేసే పిచ్చి పనుల వల్ల సీఎం జగన్ పరువు పోతోంది. పార్టీని భ్రష్టుపట్టించే పనులను ఈ ప్రభుత్వం చేయకూడదని కోరుతున్నాను.

వింటే అదృష్టం.. వైసీపీ దురదృష్టం
ప్రజాధనాన్ని ఎంతలా దుర్వినియోగం చేయాలో అంతకంటే ఎక్కువ చేస్తోన్న వైసీపీ తీరుకు నేను బాధపడుతున్నాను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండే అధికారులు.. సీఎం ఏది చెబితే అది చేయకూడదు. ఐఏఎస్ ల డిగ్నిటీని కాపాడండి. జగన్ ఇచ్చే తప్పుడు ఆదేశాలను సవరించడాకే మీరు అక్కడున్నారన్న సంగతి మర్చిపోవద్దు. ఎందుకింత తపన పడుతున్నానంటే.. నేనింకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యుడినే కాబట్టి మా పార్టీ బాగుండాలని కోరుతున్నాను. నాపై చర్యలకు ఆదేశించిన మాట నిజమే. రావణాసురుడికి మంచి చెప్పిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ విధించారు. కానీ నేను పార్టీలో ఉన్నంతకాలం మంచి చెప్పడం నా బాధ్యత కాబట్టి దానిని నెరవేర్చుతూనే ఉంటాను. సీఎం జగన్ నా మాట వింటే ప్రజల అదృష్టం. లేకుంటే వైసీపీ దురదృష్టం.

భయపెట్టి జగనన్న రక్త దోపిడీ
ప్రియతమ ముఖ్యమంత్రి, అందరిచేత బలవంతంగా జగనన్న అని పిలిపించుకునే వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టి, కరోనా వేళ జనాన్ని భయపెట్టి, మభ్యపెట్టి, పలు రకాలుగా వేధించి వేలమందితో ర్యాలీలు చేయించారు. ఓ వైపు ఎన్నికలకు కరోనా సాకు చూపుతూ ఇలా జగనన్న బర్త్ డేకు భారీ ఈవెంట్లు నిర్వహించడం మంచిదేనా? ఆ సందర్భంలోనే ‘జగనన్న రక్తదానం' పేరుతో వైసీపీ నేతలు చేసిన వీరంగం అంతా ఇంతాకాదు. నిజానికి అది ‘జగనన్న రక్త దోపిడీ'గా సాగింది. ప్రజల నుంచి బలవంతంగా రక్తాన్ని పీల్చేశారు. ముఖ్యమంత్రి పేరుతో జనం నుంచి రక్తాన్ని దోచుకుని రికార్డులు రాసుకోవడం దారుణం. కరోనాకు రక్తదానానికి సంబంధం లేదు. సరే, కరోనా సమయంలో రక్తదానాలు తక్కువయ్యాయి కాబట్టి ఆలోచన మంచిదే. కానీ దాన్ని అమలుచేసిన తీరు మాత్రం చాలా దుర్మార్గంగా ఉంది. పథకాలు ఆగిపోతాయని భయపెట్టి జనం నుంచి రక్తం లాగేసినట్లు నా దగ్గర రిపోర్టులు ఉన్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రికార్డులను సైతం బద్దలు కొట్టామని వైసీపీ వాళ్లు చెబుతున్నారు. ఈ రక్త దురాగతాలను పక్కనపెడితే..

జగనన్న రక్షణ కాదు.. జగన్ నుంచే రక్షణ
30 లక్షల ఇళ్ల పంపిణీకి సంబంధించి కొద్ది రోజుల ముందుగానే ప్రచారానికి తెరలేపారు. దీని కోసం రూ.28వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. అందులో జగన్ సర్కారు కేవలం రూ.1080కోట్లు మాత్రమే ఇచ్చారు. అసలు ఒక రాష్ట్రానికి కేంద్రం 30 లక్షల ఇళ్లు ఇచ్చే ప్రొవిజన్ ఉందో లేదో ఆలోచించుకోవాలి. ఆ తర్వాతే ప్రజలకు హామీ లివ్వాలి. లేదంటే అనవసరంగా ఆశలు కల్పించినవాళ్లమవుతాం. అసలు మన బడ్జెట్ ఎంత? ఆదాయం ఎంత? అని చూసుకున్న తర్వాతే ముందుకెళ్లాలి. మన సంకల్పం గొప్పదే అయినా, దాన్ని నెరవేర్చుకోడానికి ఆర్థిక వనరులు ఉండాల్సిందే. ఇక, జగనన్న భూరక్షణ అంటున్నారు. కానీ నిజానికి జనం రక్షణ కోరుతున్నది ప్రభుత్వం నుంచే అని ప్రజలు అంటున్నారు. జగనన్న రక్ష కంటే ముందుగా ప్రభుత్వం నుంచి భూములకు రక్ష కావాలని జనం అడుగుతున్నారు. ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలాల్లోనూ జగన్ బొమ్మలతో కూడిన రాళ్లు పాతేస్తున్నారు. ఎన్నికల్లో 51 శాతం మంది వైసీపీని ప్రేమించలేదు. వాళ్లందరికీ జగనన్న బొమ్మ నచ్చకపోవచ్చు. బలవంతపు కార్యక్రమాలు వద్దు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.