సాయిరెడ్డిని సీబీఐ కరుణిస్తుందా ?- ఫారిన్ టూర్ కు అడ్డంకిగా బెయిల్ ఆంక్షలు-16న నిర్ణయం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న ఆయనకు విదేశాలకు వెళ్లకుండా సీబీఐ కోర్టు గతంలో విధించిన ఆంక్షలు అడ్డంకిగా మారాయి. దీంతో ఆంక్షలు ఎత్తేయాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
త్వరలో ఇండోనేషియా, దుబాయ్ పర్యటనకు వెళ్లనున్న విజయసాయిరెడ్డి.. ఈ మేరకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా దేశం విడిచి వెళ్లరాదంటూ సీబీఐ కోర్టు షరతులు విధించింది. దీంతో ఆయన పాస్ పోర్టును సైతం సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు తనను అనుమతించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.

Recommended Video
గతంలో దేశం విడిచి వెళ్లరాదంటూ సీబీఐ కోర్టు విధించిన షరతును ఈసారి విదేశీ పర్యటన వరకూ సడలించాలని విజయసాయిరెడ్డి తన పిటిషన్ లో కోరారు. సీబీఐ కోర్టు అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్లనున్నట్లు తన పిటిషన్ లో తెలిపారు. దీంతో సీబీఐ కోర్టు సీబీఐ స్పందన కోరుతూ నోటీసులు ఇచ్చింది. త్వరలో సీబీఐ ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయనుంది. ఇందులో సీబీఐ స్పందన ఆధారంగానే విజయసాయి విదేశీయానానికి అనుమతి లభించనుంది. ప్రస్తుతం సీబీఐ కేసులో విచారణ శరవేగంగా సాగుతోంది. ఈ సమయంలో సాయిరెడ్డి విదేశీ పర్యటనను సీబీఐ వ్యతిరేకిస్తే మాత్రం ఆయనకు కష్టాలు తప్పకపోవచ్చు. సాయిరెడ్డి పిటిషన్ పై సీబీఐ కోర్టు ఈ నెల 16న నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications