విజన్ 2020 అంటే 2004 పోయే..! ఇప్పుడు 2047తో మళ్లీ..! బాబుపై సాయిరెడ్డి సెటైర్లు..
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై నిత్యం విమర్శలు గుప్పించే వారిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందుంటారు. మధ్యలో తారకరత్న చనిపోయినప్పుడు కాస్త బ్రేక్ ఇచ్చిన సాయిరెడ్డి.. ఆ తర్వాత మళ్లీ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు టూర్లను, ఆయన చేస్తున్న ప్రకటనల్ని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ ట్వీట్స్ రూపంలో ట్రోల్ చేసేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైజాగ్ లో చంద్రబాబు విడుదల చేసిన విజన్ 2047 ను టార్గెట్ చేశారు.
వైజాగ్ లో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు జీఎఫ్ఎస్టీ ఛైర్మన్ హోదాలో ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఇందులో భారత్ 2047 నాటికి అంటే స్వాతంత్రం సాధించి వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి భారత్ గ్లోబల్ పవర్ గా ఎదగాలంటే అనుసరించాల్సిన ఐదు వ్యూహాల్ని విడుదల చేశారు. తద్వారా భారత్ కు గ్లోబల్ పవర్ గా మారే అవకాశాలు ఉన్నాయని, అందుకు ఈ వ్యూహం అనుసరిస్తే సరిపోతుందని చంద్రబాబు తెలిపారు. దీనిపై సాయిరెడ్డి ట్వీట్ సెటైర్ వేశారు.

విజన్ 2020 అని దేశమంతా తిరిగి స్వీయ ప్రగల్భాలు పలికినా 2004లో ప్రజలు చిత్తుగా ఓడించారని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ట్వీట్ లో గుర్తుచేశారు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో గారడీ చేయాలని చూస్తున్నారని సాయిరెడ్డి ఆక్షేపించారు. ఓడి పడవకు (ఓడిపోయే పడవ) పైన ఎన్ని అలంకారాలు చేసినా నీటి లోకి వెళ్లిన తర్వాత మునగక తప్పదంటూ సాయిరెడ్డి చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పదే పదే విజన్ 2020 గురించి చెప్పేవారు. కానీ 2004 నాటికి ఆయన రాష్ట్రంలో అనుసరించిన విధానాల కారణంగా అధికారం కోల్పోయారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఆయనకు పదేళ్లు పట్టింది. 2014లో బీజేపీ,జనసేన కూటమి పొత్తుతో చంద్రబాబు తిరిగి అధికారం సాధించగలిగారు. కానీ ఐదేళ్లలోనే తిరిగి అధికారం కోల్పోయారు. ఇప్పుడు ఆ విషయాల్ని గుర్తుచేస్తూ సాయిరెడ్డి ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications