అమరావతి పాదయాత్రకు సహకరిస్తున్నా- ఈ విషప్రచారమేంటి ? సాయిరెడ్డి ఫైర్
అమరావతి : అమరావతి రాజధాని కోరుతూ రైతులు చేపట్టిన రెండో విడత పాదయాత్ర ఇవాళ ఆరంభమైన సందర్భంగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు పాదయాత్రతో పాటు టీడీపీని, ఈ పాదయాత్రను కవర్ చేస్తున్న మీడియా సంస్ధల్ని కూడా సాయిరెడ్డి టార్గెట్ చేసారు.
తెలుగుదేశం అనుకూల మీడియా హడావుడి మొదలైందని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విషయమై కేసు రాష్ట్ర హైకోర్టు విచారణలో ఉండగానే ఈ 'మహా పాదయాత్ర'ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, వారి శ్రేయోభిలాషులు భావిస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.టీడీపీ నేతలు,మాజీ సీఎం వందిమాగధులు గత రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు కొంత వరకు ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయన్నారు. ఏపీ రాజధాని విషయమై పాలకపక్షం అసెంబ్లీలో బిల్లులను ఉపసంహరించుకున్నాక కూడా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులను ఒక పథకం ప్రకారం అనవసర అలజడికి గురిచేస్తూ, వారిని ఆందోళన దిశగా నడిపించే చర్యలను తెలుగుదేశం తీసుకుందన్నారు.

రాజధాని వివాదం ఉన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉండగా, అమరావతి నుంచి అరసవిల్లికి బయల్దేరిన రైతుల పాదయాత్ర ప్రశాంతంగా సాగాలనే ఎవరైనా కోరుకుంటారని విజయసాయిరెడ్డి అన్నారు. ముఖ్యంగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా యాత్ర సాగిపోవాలని, ముగియాలని ఆశిస్తోందన్నారు. అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందన్నారు. రైతుల ఉత్తరాంధ్ర నడక ప్రయాణం మొదలవడానికి ముందే టీడీపీ నేతలు అమరావతిలో వేడి పుట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారని సాయిరెడ్డి ఆరోపించారు..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉండాలని, ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిపోవాలనే వైఎస్సార్ కాంగ్రెస్ మొదట్నించీ కోరుకుంటోందన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు 2019 చివరి నెలలో ఈ ప్రక్రియలో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజల ముందుకు తెచ్చిందన్నారు. అసెంబ్లీలో బిల్లులు కూడా ఆమోదించాక ఈ విషయం హైకోర్టులో విచారణాంశంగా మారిందని, రాజధానుల విషయంలో వైఎస్సార్సీపీ సర్కారు పట్టుదలకు పోకుండా నిగ్రహంతో వ్యవహరించిందన్నారు. హైకోర్టు ఈ విషయంపై విచారణను నిర్ణయాత్మక దశకు తీసుకేళ్లే సమయంలో-రాజధాని బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపిందన్నారు. ఈ హామీకి అనుగుణంగా శాసనపరమైన చర్యలు తీసుకుందని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే విషయమై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎంతటి దుందుడుకు ప్రకటనలు చేసినా జగన్ ప్రభుత్వం ఇలా సంయమనంతో వ్యవహరిస్తోందన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణపై అన్ని ప్రాంతాల ప్రజలకు నచ్చజెప్పాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రెండో దశ యాత్రను రాష్ట్ర ప్రభుత్వంపై, పాలకపక్షంపై రైతుల 'ఆగ్రహ పాదయాత్ర'గా చిత్రించే ప్రయత్నాలు తెలుగుదేశం, దాని అనుకూల మీడియా ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిదన్నారు. విశాఖపట్నం వంటి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం ఉన్నాగాని ఇంకా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో- తమ ప్రాంతం అభివృద్ధికి ఇతర ప్రాంతాలవారు అడ్డుపడుతున్నారనే భావన రాకుండా అందరూ సంయమనంతో వ్యవహరిస్తే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications