ప్రతిఒక్కరిని స్పెషల్ పర్పస్ ‘వెహికల్’లా వాడుకోవటంలో టీడీపీ దిట్ట!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఏపీలో వచ్చే ఎన్నికల పొత్తులపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో వైసీపీ నేతలు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీని గద్దె దించడం కోసం ప్లాన్ చేస్తున్న పొత్తులపై ప్రధానంగా ఫోకస్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విజయసాయిరెడ్డి గత కొంతకాలం ట్విట్టర్లో సైలెంట్ గా ఉన్నా మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతున్నారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తిట్టిపోస్తున్నారు.

తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసిన సాయి రెడ్డి టీడీపీకి ఒక సిద్ధాంతం లేదని మండిపడ్డారు. మాట పట్టింపు అంతకన్నా లేదని విమర్శించారు. దోచుకు తినాలన్న దురాశ టిడిపికి తగ్గలేదని అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరిని ఒక స్పెషల్ పర్పస్ 'వెహికల్'లా వాడుకుంటారని ఆరోపించారు. కులాల మధ్య, కుటుంబాల మధ్య కుంపట్లు పెడతారని నిప్పులు చెరిగారు. కేవలం గద్దె ఎక్కేందుకే ఈ అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు.
అసలు తీర్పరులైన ప్రజలకు, ఎక్కడ వాతలు పెట్టాలో తెలుసు అంటూ సోషల్ మీడియా వేదికగా విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు విపక్ష టిడిపి నాయకుల పల్లకీని మోయని వారిని శత్రువులుగా చూస్తే ఐదు కోట్ల ఆంధ్రులు మీకు శత్రువులే అవుతారంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మీకు మిత్రులే లేకుండా పోతారు మహాశయా అంటూ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించడం లేదని స్పష్టం చేశారు.

అంతేకాదు కడుపులో కత్తులు పట్టుకుని కౌగిలించుకునే బదులు ఎవరికి వారే ప్రజాక్షేత్రంలోకి వెళితే ఎవరి బలం ఎంత అనేది స్పష్టంగా తెలిసిపోతుందని పేర్కొన్నారు. ఈ ముసుగులో గుద్దులాటలు, పచ్చ మీడియాలో రాతల మర్మం ఏమిటో ప్రజలకు తెలియనిది కాదని విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పదేపదే ప్రజలు వైసిపి వైపే ఉన్నారని, జగన్ పాలన మళ్లీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని సాయి రెడ్డి తన పోస్టుల ద్వారా స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications