జగన్ పార్టీ అవిశ్వాసం: అందుకని టిడిపి ఎంపీల ఆగ్రహం
న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభాపతి మీరా కుమార్‌కు సోమవారం అవిశ్వాస నోటీసులు అందజేసింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు వరుసగా అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలు వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి ముగ్గురు సంతకాలు చేసిన నోటీసును స్పీకర్‌కు అందజేశారు.

టిడిపి ఫైర్
ధరలను, అవినీతిని అదుపు చేయలేకపోయిన కేంద్రం అధికారంలో ఉండే నైతిక హక్కును కోల్పోయిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కొణకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నిమ్మల కిష్టప్పలు అన్నారు. స్పీకర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
అవిశ్వాస తీర్మానంపై తాము అన్ని పార్టీల సహకారం కోరుతున్నామన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెసు పార్టీకి అధికారంలో ఉండే హక్కులేదని అర్థమవుతోందన్నారు. అధికారంలో కొనసాగే హక్కు లేనందునే తాము అవిశ్వాసంపై నోటీసు ఇచ్చామన్నారు. కాంగ్రెసు పాలనలో దేశం సర్వనాశనం అవుతోందని ధ్వజమెత్తారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు.
198 కింద తాము అవిశ్వాసం నోటీసు ఇచ్చామన్నారు. అవిశ్వాసం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలందరిదీ ఒకే విధానమన్నారు. తెలుగు ప్రజల మధ్య కాంగ్రెసు పార్టీ చిచ్చుపెట్టిందని ధ్వజమెత్తారు. కేంద్రం ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలంపై కేంద్రం నడుస్తోందని, విభజన విషయంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు కేంద్రం పాల్పడిందని ఆరోపించారు.
పొరుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు సొంత ప్రయోజనాల కోసమే మన రాష్ట్ర ఎంపీలను అవమానపరుస్తున్నారన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీలుబొమ్మగా మారారన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోయిందన్నారు. కాగా, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి. కాంగ్రెసు పార్టీ నుండి ఆరుగురు, టిడిపి నుండి నలుగురు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ముగ్గురు సంతకాలు చేశారు.












Click it and Unblock the Notifications