రాజ్యసభలో రెండో రోజూ వైసీపీ ఆందోళన-ప్రత్యేక హోదా కోరుతూ నిరసనలు
ఏపీకి ప్రత్యేక హోదా అంశం వరుసగా రెండోరోజూ రాజ్యసభను కుదిపేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచే విభజన హామీలపై పట్టుబడుతున్న వైసీపీ ఎంపీలు.. తమ పోరు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిన్న రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై నోటీసులు ఇచ్చి సభను అడ్డుకున్న వైసీపీ ఎంపీలు.. ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా హామీపై చర్చ కోరుతూ రాజ్యసభలో ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రూల్ 267 కింద ఇచ్చిన నోటీసు ఇవ్వగా.. రాజ్యసభ చైర్మన్ దాన్ని తిరస్కరించారు. దీంతో ప్లకార్డ్ పట్టుకుని విజయసాయి రెడ్డి పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఇంతలో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విజయసాయి రెడ్డితోపాటు ప్రతిపక్ష సభ్యులు తాము రూల్ 267 కింద తాము ఇచ్చిన నోటీసును అనుమతించాలని మరోసారి కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ రూల్ 267 కింద ఈరోజు 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమంతించలేనని అన్నారు.

ఈ దశలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమేనని తెలిపారు. దీనిపై చర్చకు ఎప్పుడు అనుమతిస్తారని రాజ్యసభ ఛైర్మన్ ను ప్రశ్నించారు. దీనిపై వాదన వద్దని, ఈ అంశం (ప్రత్యేక హోదా) మీకు (రాష్ట్ర ప్రభుత్వం) కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని జవాబిచ్చారు. చైర్మన్ జవాబుకు సంతృప్తి చెందని విజయసాయి రెడ్డి ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద ప్రదర్శిస్తూ నిలబడ్డారు. సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్ సభను మరోసారి గంటపాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications