వైసీపీ రంగుల్లో జగనన్న గోరుముద్ద పాకెట్లు: సెల్ఫ్ పబ్లిసిటీ కోసం: రఘురామ మళ్లీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మరోసారి రంగుల ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇదివరకు గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్సీపీ రంగులను వేశారంటూ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. దీనిపై కోర్టుకెక్కింది. రంగులను తొలగించేంత వరకూ న్యాయపోరాటం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శ్మశానాలకు కూడా తెలుగుదేశం పార్టీ రంగులను వేశారంటూ వైసీపీ నాయకులు ఎదురుదాడి చేసినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. రంగులను మార్చాల్సి వచ్చింది.

మళ్లీ రంగుల వివాదం..
ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితే తలెత్తినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న గోరుముద్ద పథకం తాజాగా ఈ రంగుల విమర్శలకు కేంద్రబిందువైంది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందించే ఆహారంలో భాగమైన చిక్కీ పాకెట్లపై విమర్శలు ఎదురవుతున్నాయి. చిక్కీని వైఎస్ఆర్సీపీ రంగులను ముద్రించిన పాకెట్లల్లో ఉంచి ప్రభుత్వం సరఫరా చేస్తోందంటూ ఆరోపిస్తోన్నారు.

గోరుముద్దపై
అధికార వైఎస్ఆర్సీపీకే చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఈ విమర్శలను ప్రభుత్వంపై సంధించారు. చిక్కీ పాకెట్లపై వైఎస్ జగన్ బొమ్మను ముద్రించడం, వైఎస్ఆర్సీపీ జెండా రంగుల్లోని నీలం, తెలుపు, ఆకుపచ్చను ముద్రించడాన్ని రఘురామ తప్పు పట్టారు. పార్టీ ప్రచారం పతాక స్థాయికి చేరుకుందని విమర్శించారు. ఫొటోలు, పార్టీ రంగుల మేనియా ఏ పీక్స్‌కు చేరిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై సంధించే విమర్శల పదును పెంచారు.

వైసీపీ రంగుల్లో చిక్కీ పాకెట్లు..
తన ట్వీట్‌కు జగనన్న గోరుముద్ద చిక్కీ పాకెట్ ఫొటోను జత చేశారు. చిక్కీ ప్యాకెట్ ఖర్చు.. చిక్కీ తయారీ ఖర్చును మించి పోయిందని ఎద్దేవా చేశారు. స్వీయ ప్రచారం కోసం వైఎస్ జగన్ ప్రజాధనాన్ని నీళ్ల పాటు చేశారంటూ మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందంటూ సోషియో ఎకనమిక్ సర్వే వెల్లడించిన రెండో రోజే- రఘురామ కృష్ణంరాజు అవే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే జగనన్న గోరుముద్ద పథకాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలను సంధించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

సోషియో ఎకనమిక్ ప్రశంసలు..
ఏపీలో రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 13 లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారంటూ సోషియో ఎకనమిక్ సర్వే నివేదిక జగన్ సర్కార్‌ను ప్రశంసించింది. ఈ విషయంలో ఏపీ ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చింది. నాడు-నేడు కింద రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను జగన్ సర్కార్ పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను వ్యయం చేస్తోంది. నాణ్యమైన విద్యను అందిస్తోంది.

మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతో..
కనీవినీ ఎరుగని విధంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లను సైతం పునర్నిర్మించింది. ఇంగ్లీష్‌లో విద్యాబోధనను చేపట్టింది. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిన ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను వైఎస్ జగన్ సమూలంగా మార్చివేశారు. ఫలితంగా- పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపల్స్.. నో అడ్మిషన్ల బోర్డులను పెట్టాల్సి వచ్చేంతలా డిమాండ్ పెరిగింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా చిక్కీని సరఫరా చేస్తోంది.












Click it and Unblock the Notifications