కాసేపట్లో ఏపీలో రఘురామ ఎంట్రీ-రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద టెన్షన్?
వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు ఏపీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల క్రితం వైసీపీ సర్కార్ వరుస కేసులు నమోదు చేయడంతో హైదరాబాద్ వెళ్లిపోయిన ఆయన్ను అక్కడకు వెళ్లి మరీ సీఐడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత గుంటూరులో సీఐడీ కస్టడీ టార్చర్ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందిన రఘురామరాజు.. అప్పటి నుంచీ ఢిల్లీ, హైదారాబాద్ లోనే ఉంటున్నారు.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి ఆయన ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏటా సొంతూరిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనే రఘురామకు ఈ నాలుగేళ్లలో ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనాలని భావిస్తున్న ఆయన భీమవరం వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అలాగే హైకోర్టును కూడా ఆశ్రయించారు.

పోలీసులు ఇప్పటికే తనపై 11 తప్పుడు కేసులు నమోదు చేశారని, ఇప్పుడు మరో కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని హైకోర్టు దృష్టికి రఘురామ తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, ఎంపీకి ఇచ్చే భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రఘురామ ఇవాళ భీమవరం వెళ్లేందుకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం వెళ్తారు.
అయితే పోలీసులు మాత్రం ఆయనపై గతంలో నమోదైన అట్రాసిటీ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎయిర్ పోర్టులో రఘురామ అడుగుపెట్టగానే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయనకు మద్దతుగా భారీ ఎత్తున టీడీపీ-జనసేన కార్యకర్తలు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వస్తారని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మాత్రం రఘురామ రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో భారీ ర్యాలీగా భీమవరం వెళ్లిపోతారు.












Click it and Unblock the Notifications