గుంటూరు ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం..! టీడీపీ అభ్యర్ధితో అంబటి ఓపెన్ డీల్..!
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్య నామినేషన్ల అడ్డగింతలు, దాడులు, నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం, ఎస్ఈసీకి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగాయి. దీంతో ఎస్ఈసీ కూడా మున్సిపల్ ఎన్నికల్ని రీషెడ్యూల్ చేయడంతో పాటు జిల్లా ఎస్పీలకూ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గింటూరులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు నామినేషన్ల దాఖలు, ప్రచారాల హడావిడిలో ఉన్నారు. ఇందులో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో 12వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వచ్చారు. దీంతో ఆయనకు స్ధానిక టీడీపీ కార్పోరేటర్ అభ్యర్ధి, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న నాయకులు పరస్పరం ఎదురుపడ్డారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడటం ప్రారంభించారు. కానీ అంబటి రాంబాబు మాత్రం భిన్నంగా స్పందించారు. టీడీపీ నాయకులకు ఓ ఆఫర్ ఇచ్చారు.

*గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన..!**12వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.**అంబటి రాంబాబుకు ఎదురుపడిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి.**ఎవరి ఎన్నికల ప్రచారం వాళ్లు ప్రశాంతంగా చేసుకుందామన్న అంబటి రాంబాబు.**పల్నాడు మాదిరిగా గొడవలు వద్దు.. ఆదర్శంగా ఉందామన్న అంబటి రాంబాబు.*#guntur#YSRCP
— ಲಕ್ಷ್ಯ ⚔️ Valkyrie ⚔️ (@WomenWarriorTDP) October 23, 2026
టీడీపీ, వైసీపీ నేతలు ఇద్దరూ ఎలాంటి వివాదాలు లేకుండా ఎవరి దారిలో వారు నామినేషన్లు వేసుకుందామని, ప్రచారాలు చేసుకుందామని అంబటి తెలిపారు. కలిసి మెలిసి అందరూ ఎన్నికల్లో పోటీ పడాలని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటూ వారితో అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అనవసరంగా తగాదాలు పడటం, గందరగోళాలు చేసుకోవడం, తలకాయలు పగలగొట్టుకోవడం పల్నాడులో చూస్తున్నామని, కానీ ఇక్కడ హాయిగా ప్రచారం చేసుకోవాలని వారిని అంబటి కోరారు. ఎవరు గెలిస్తే వాళ్లు పలావు పెట్టండి.. మేం వస్తాం అంటూ వారికి ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో టీడీపీ నాయకులు కూడా సరేనంటూ అంగీకరించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు ప్రచారాలకు వెళ్లిపోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న వేళ అంబటి చొరవ చూపించి టీడీపీ అభ్యర్ధులతో సుహృద్భావంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.













Click it and Unblock the Notifications
