టైం చూసి గురి పెట్టిన జగన్ - టీడీపీ మూలాలే టార్గెట్..!!
వై నాట్ 175. ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ మూలాల పైన గురి పెట్టారు. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా సామాజిక సమీకరణాలు - ఇక, ప్రస్తుతం సంక్షేమం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. వీటిల్లో తనదే పై చేయి కొనసాగేలా జగన్ వ్యూహం సిద్దం చేసారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు.
ప్రలజ మధ్యన వైసీపీ:ఏపీలోని అధికార వైసీపీ ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది పార్టీ. అందులో భాగంగా బస్సుయాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇటీవల వైసీపీ నేతలతో చర్చించిన సీఎం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సామాజిక న్యాయ యాత్ర కు సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ అధిష్టానం ఫిక్స్ చేసింది.

ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బస్సులను రెడీ చేశారు.
సంక్షేమం - సామాజిక న్యాయం:బస్సుల ముందు భాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. పైభాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రమఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలు తొలిరోజైన నేడు ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభిస్తున్నారు.
ప్రతి బస్సు యాత్రను ఒకటీమ్ గా ఏర్పాటు చేస్తూ అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లీడర్లు స్పీకర్లుగా ఉండేలా నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా ఈ నాలుగున్నారేళ్ల కాలంలో చేసిన సంక్షేమం గురించి ప్రచారం చేయటంతో పాటుగా సామాజిక న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నారో వివరించనున్నారు.

ప్రతిపక్షాలే టార్గెట్:అటు చంద్రబాబు జైలులో ఉన్నారు. భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సంక్షేమం ప్రధాన అస్త్రంగా మారుతోంది. జగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమం విషయంలో ముందు నిలిచారు.
ప్రతిపక్షాలకు సంక్షేమం విషయంలో ఏ మాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితి కల్పించారు. ఇక, సామాజిక న్యాయం పేరుతో మెజార్టీ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సంక్షేమం - సామాజిక న్యాయం వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తాయని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఈ రెండు అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయంగా భావించారు. ప్రతిపక్షాలను మరింతగా ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహంతో వైసీపీ ప్రారంభిస్తున్న ఈ బస్సు యాత్రకు ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications