వైఎస్ జగన్ కేబినెట్‌లో అనూహ్య కూర్పు: గుంటూరు జిల్లా బీసీ నేతకు కీలక శాఖలు
అమరావతి: మరో 24 గంటల్లో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకోనుంది. పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు కానుంది. మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పరిసర ప్రాంగణంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం ఆరంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. దీనికోసం ఆయన శుక్రవారం సాయంత్రం విజయవాడకు రానున్నారు. సాయంత్రానికి శాఖలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

కూర్పు అనూహ్యంగా ఉండబోతోందా?
కాగా- రాష్ట్రమంత్రివర్గ కూర్పులో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు కనినిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నిన్న, మొన్నటి దాకా వినిపించిన పేర్లకు అదనంగా లేదా కొత్తగా మరి కొందరు సీనియర్ నేతల పేర్లు జత కలవడం దాదాపు ఖాయమైంది. ఇందులో- గుంటూరు జిల్లాకు చెందిన వెనుక బడిన వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటిదాకా ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. ఆయనకు కొన్ని కీలక శాఖలను అప్పగించవచ్చని సమాచారం.

జంగా కృష్ణమూర్తికి పెద్దపీట
జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేల కోటా కింద ఆయన మండలికి ఎన్నికయ్యారు. చాలాకాలం పాటు ఆయన కాంగ్రెస్‌లో పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు ఉంది. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
2009లో కాంగ్రెస్ తరఫున, 2014లో వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన బరిలో దిగలేదు. గురజాల టికెట్‌ను కాసు మహేష్ రెడ్డికి కేటాయించారు. జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్‌ను వీడారు. వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్న కొద్దిమంది నేతల్లో జంగా కృష్ణమూర్తి ఒకరు.

బీసీ విభాగం ఛైర్మన్‌గా
అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ జగన్ ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు. వైఎస్ఆర్ సీపీ బీసీ విభాగం ఛైర్మన్‌గా జంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో కీలక శాఖలను అప్పగించాలని యోచిస్తున్నారు. జంగా కృష్ణమూర్తి బీసీ నాయకుడు కావడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు ఉండటం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీకి అండగా నిలవడం వంటి అంశాలు కలిసి వచ్చే అంశాలు. వివాదరహితుడనే పేరు ఎలాగూ ఉంది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జంగా కృష్ణమూర్తికి క్యాబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు.

ఉత్తరాంధ్ర నుంచి కొప్పుల వెలమ..సీమ నుంచి బోయ సామాజిక వర్గానికి ప్రాధాన్యత..
జంగా కృష్ణమూర్తితో పాటు కనీసం నాలుగైదు అనూహ్యమైన పేర్లు వినిపించే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వొచ్చని చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీసీలుగా ఉన్న కొప్పుల వెలమ వర్గానికి చెందిన నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కాపులు, గుంటూరు నుంచి మైనారిటీ, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రవర్గంలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.

ఇద్దరు మైనారిటీ నేతలకు చోటు ఉంటుందా?
రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మైనారిటీలకు చోటు ఉండొచ్చని చెబుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి, ఓడిపోయిన ఇక్బాల్‌కు మంత్రివర్గంలోకి తీసుకుంటానని వైఎస్ జగన్ ప్రకటించారు. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ముస్లిం నాయకులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో మైనారిటీ కోటాలో ఇక్బాల్‌కు బెర్త్ ఖాయమైంది. గుంటూరు జిల్లా నుంచి వరుసగా రెండోసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముస్తఫాకు కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications