ఆ ఎమ్మెల్యేకు జనసేనతో లింకు - నా పై సస్పెన్షనా : వైసీపీ పెద్దలూ చెప్పండి..!!
వైసీపీ నేత..మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను సీఎం జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పార్టీ నేతల సిఫార్సు మేరకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. రావి వెంకట రమణ మధ్య ఉన్న విభేదాల కారణంగా చోటు చేసుకున్న పరిణామాల్లో సస్పెన్షన్ వేటు పడింది. రావి వెంకట రమణ 2004లో కాంగ్రెస్ నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఆయనతో ఉన్నారు.
2014లో పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సీటు ఆశించినా దక్కలేదు. ఆ తరువాత అక్కడ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు అల్లుడు రోశయ్య ఎమ్మెల్యే అయ్యారు. దీంతో..వెంకట రమణ - రోశయ్య మధ్య నియోజకవర్గంలో వర్గ పోరు కొనసాగుతోంది. ఇక, సస్పెండ్ అయిన రావి వెంకట రమణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.

తను ఎందుకు సస్పెండ్ చేసారో చెప్పాలని పార్టీ పెద్దలను కోరారు. వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఘనల తన రాజకీయ జీవితంలో ఒక్కటి కూడా లేదన్నారు. ఈ విషయంలో తాను ఎవరితో అయినా చర్చకు సిద్దమని వెల్లడించారు. తన సస్పెన్షన్ కు కారణం ఏంటో ఇప్పటికీ ఎవరూ స్పష్టత ఇవ్వలేదన్నారు.
తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితం లో కాంగ్రెస్..వైసీపీ మినహా మరే పార్టీ వైపు చూడలేదని చెప్పుకొచ్చారు. సంగం డెయిరీలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నానని...అదే సొంత పార్టీలో కొందరు నేతలకు రుచించటం లేదని పేర్కొన్నారు. వైసీపీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పైన రావి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు చేసారు.
టీడీపీతో పాటుగా జనసేనతో ఎమ్మెల్యే రోశయ్యకు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి ఏ కారణంతో తనను సస్పెండ్ చేసారో చెప్పాల్సిన బాధ్యత పార్టీ నేతల పైన ఉందన్నారు రావి వెంకట రమణ. ఇప్పుడు రావి చేసిన వ్యాఖ్యల పైన పార్టీ ఎమ్మెల్యే రోశయ్య తో సహా. పార్టీ ముఖ్య నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications