రేపు జనసేనలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! సీమలో మారిన లెక్కలతో..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ నేతల ఫిరాయింపుల పర్వం కూడా క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు మరో వారం రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా తమకు అనుకూలంగా ఉండే పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీపడుతున్నారు. ఇదే క్రమంలో రాయలసీమ జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే రేపు జనసేన తీర్దం పుచ్చుకోనున్నారు.
గత ఎన్నికల్లో తొలిసారిగా చిత్తూరు అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ టికెట్ పై గెలిచిన అరణి శ్రీనివాసులు కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది. తాజాగా ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో అరణి శ్రీనివాసులును పక్కనబెట్టేయడంతో ఆయన విపక్ష జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే శ్రీనివాసులు హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో వైసీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి చెందిన అరణి శ్రీనివాసులుకు వైసీపీ టికెట్ నిరాకరణపై ఇప్పటికే ఆయన సామాజిక వర్గం తీవ్ర విమర్శలకు దిగుతోంది. అదే సమయంలో జనసేన పార్టీలో ఆయన చేరికను కూడా స్వాగతిస్తోంది. దీంతో రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు అరణి శ్రీనివాసులు రంగం సిద్ధం చేసుకున్నారు. జనసేనలో చేరాక ఆయనకు తిరిగి సిట్టింగ్ సీటు అయిన చిత్తూరులో పోటీ చేసే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
జనసేనలో చేరిక వేళ తన సొంత పార్టీ వైసీపీపై అరణి శ్రీనివాసులు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తనను చిత్తూరులో స్ధానిక ఎమ్మెల్యేగా ఏమీ చేయలేని స్దితికి తీసుకొచ్చారంటూ ఆరోపించారు. తన సొంత కంపెనీ వేసిన టెండర్లకు రూ.74 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కానీ జగన్ తన వారి బిల్లుల్ని మాత్రం క్లియర్ చేసుకుంటున్నారని ఆరోపించారు. తనను రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ వైసీపీ నేతలపై అరణి శ్రీనివాసులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications