కేంద్రంపై వైసీపీ, టీడీపీ క్లియర్-ఇక డిసైడ్ అవ్వాల్సింది జనమే ? 2024లో ప్రత్యామ్నాయం అదేనా !
కేంద్రంలో ఎనిమిదేళ్లుగా ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉంది. 2019కి ముందు ఎన్డీయేతో అంటగాగిన టీడీపీ ఆ తర్వాత తగిలిన ఎదురుదెబ్బలతో ఇప్పుడు తిరిగి బీజేపీ గూటిలో పక్షిగా మారిపోతోంది. వైసీపీ ముందునుంచీ కాంగ్రెస్ పై ఉన్న కోపంతో ఎన్డీయేకు దగ్గరగానే ఉంది. చివరికి ఇరు పార్టీలూ రాష్ట్ర ప్రయోజనాల పేరుతో కేంద్రంలోని ఎన్డీయేతో అంటకాగుతున్నాయి. కానీ ఏపీకి కేంద్రం చేస్తుందేమీ లేదు. కేవలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్లో బిల్లుల విషయంలో ఇరు పార్టీల్ని వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రజల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ?

బీజేపీతో మద్దతులో వైసీపీ, టీడీపీ
ప్రస్తుతం కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ భారీ మద్దతుదారులుగా ఉన్నాయి. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. త్వరలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇరు పార్టీలదీ అదే దారి. విభజన హామీలు నెరవేర్చకపోయినా, ఏపీకి నిధులు కేటాయించకపోయినా, మరే ఇతర విషయంలోనూ సాయం చేయకపోయినా కేంద్రాన్ని వీరిద్దరూ పల్లెత్తు మాట అనే ధైర్యం లేదు. దీంతో బీజేపీకి మద్దతు విషయంలో వైసీపీ, టీడీపీ స్పష్టంగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.

ప్రజల సంగతేంటి ?
ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూడా కేంద్రంలోని ఎన్డీయేకి అడిగినా, అడక్కపోయినా అండగా నిలుస్తున్న నేపథ్యంలో స్ధానికంగా రాష్ట్ర ప్రజలు దీనిపై ఎలా స్పందిస్తున్నారన్న దానిపై జాతీయ స్దాయిలో చర్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ ఇద్దరూ రాష్ట్ర అవసరాల కంటే కూడా తమ ప్రయోజనాల కోసమే కేంద్రంలోని ఎన్డీయేకు అండగా నిలుస్తున్నాయన్న విషయంలో ఇక్కడి జనానికి ఎలాంటి సందేహాలు లేవు. రాబోయే రోజుల్లోనూ ఇంతకు మించి ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశ కూడా వారిలో కనిపించడం లేదు. దీంతో జనం సరైన సమయంలో దీనిపై స్పందించే అవకాశాలే కనిపిస్తున్నాయి.

2024 ఎన్నికల్లో ప్రత్యామ్నాయం అదేనా ?
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడే రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెడుతున్న వైసీపీ, టీడీపీ విషయంలో ప్రజలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కడం ఖాయమన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా బేషరతుగా కేంద్రానికి మద్దతిస్తున్న ఇరు పార్టీలు ప్రజల ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాలే ముఖ్యమని వారు భావిస్తున్నారు. దీంతో అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలే ప్రత్యామ్నాయం అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పటికల్లా కాంగ్రెస్ పార్టీ కోలుకుంటే మాత్రం ఎంపీ సీట్ల విషయంలో జనం కాస్త ఆలోచించినా ఆశ్చర్యం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications