పల్నాడులో ఈ నియోజకవర్గం రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం
Gurazala Assembly round up: పల్నాడు జిల్లా నరసరావుపేట లోకసభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం.. గురజాల. దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల, మాచవరం మండలాలు దీని పరిధిలో ఉంటాయి. 2,68,469 మంది ఓటర్లు ఉన్నారీ నియోజకవర్గంలో. సంఖ్యాపరంగా చూసుకుంటే- ముస్లింలు, కాపులు, రెడ్లు, కమ్మ, వైశ్య సామాజిక వర్గాలు ఎక్కువ.
ఎన్నికల యుధ్ధం మాత్రం ప్రధానంగా కమ్మ-రెడ్డి సామాజిక వర్గాల మధ్యే ఉంటుంది. 1955 నుంచి 2019 వరకు గురజాలకు 14 ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు అయిదుసార్లు గెలిచారు. రెండో స్థానంలో కమ్మ అభ్యర్థులు ఉన్నారు. వాళ్లు నాలుగు సార్లు విజయం సాధించారు.

యాదవులు, వైశ్యులు రెండుసార్లు చొప్పున ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. కాపులు ఒక్కసారే గెలిచారు. టీడీపీ ఆవిర్భవించక ముందు అయిదుసార్లు ఎన్నికలు జరగాయి. కాంగ్రెస్ మూడుసార్లు ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. కృషీకార్ లోక్ పార్టీ, సీపీఐ ఒక్కసారి విజయం సాధించాయి.
టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిది ఎన్నికలు జరిగాయి. అయిదు సార్లు టీడీపీ జెండా ఎగురవేసిందిక్కడ. కాంగ్రెస్ మూడుసార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచాయి. టీడీపీ తరఫున యరపతినేని శ్రీనివాసరావు మూడుసార్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి రెండు దఫాలుగా గెలిచారు.
2009, 2014 ఎన్నికల్లో యరపతినేని శ్రీనివాసరావు గెలిచారు. 2019 ఎన్నికల్లో మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డి.. టీడీపీకి చెందిన యరపతినేనిపై 28,613 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున కాసు మహేష్ రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే. టీడీపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది ఆసక్తి రేపుతోంది. యరపతినేనికి టికెట్ దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠత రేపుతోంది.












Click it and Unblock the Notifications