వైసీపీలో చలనం: టీడీపీకి థ్యాంక్స్ చెబుతున్న క్యాడర్
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తీసుకుంటోన్న నిర్ణయాలు, చర్యలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చలనాన్ని తీసుకొచ్చాయి.
ఉప ఎన్నికల్లో దౌర్జన్యాలు..
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సొంతంగా ఎలాంటి బలం లేకపోయినప్పటికీ వాటిని సొంతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సాగిస్తోన్న ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీకి అదనపు అస్త్రాలను అందించినట్టయింది. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానం, ఆ తరువాత పాలకొండ, తుని, పిడుగురాళ్ల.. వంటి స్థానిక సంస్థలను దక్కించుకోవడానికి టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపిస్తోంది వైసీపీ.

సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడం..
ఇప్పటికే ఒక్క పింఛన్లు మినహా మిగిలిన సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడం, వాటిని అప్పుడు ఇప్పుడూ వాయిదాలు వేస్తూ వస్తోండటం, దాదాపుగా అటకెక్కించిన వ్యవహారం పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందనేది బహిరంగ రహస్యం. స్వయంగా చంద్రబాబు అన్నమయ్య రాయచోటి జిల్లా సంబేపల్లి బహిరంగ సభలో దీన్ని చవి చూశారు కూడా.
ఛలో తుని..
కాకినాడ జిల్లా తుని మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందంటూ మండిపడుతోంది వైసీపీ. టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేడు ఛలో తుని ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలంటూ విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.
మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉప ఎన్నికలో..
తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల తీరును ఆయన తప్పు పట్టారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నికను టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటోందంటూ విమర్శించారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నాడంటూ విమర్శించారు. కలెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషన్ దృష్టికీ..
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నిక వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికీ ఫిర్యాదు చేశారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా టీడీపీ నాయకులు నేతలు అడ్డుకుంటున్నారని, ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను టీడీపీ నేతలు బేఖాతరు చేశారని అన్నారు. ఈ ఘటనలపై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications