మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్..! సజ్జల కీలక ప్రకటన ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలమైన జగన్.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రూటుమార్చారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలపై విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు రాజధానుల విషయంలో వైసీపీ పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సంచలన ప్రకటన చేశారు.
ఓ డిజిటల్ మీడియా కాంక్లేవ్ లో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి మూడు రాజధానులు ఆలోచన లేదని ఆయన తేల్చిచెప్పేశారు. జగన్ అమరావతి నుండే పరిపాలన సాగిస్తారని సజ్జల తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ఖర్చు తగ్గించి బ్రభుత్వంపై భారం తగ్గిస్తూ గుంటూరు-విజయవాడ మధ్య మహా నగర నిర్మాణానికి కృషి చేస్తామని సజ్జల ప్రకటించారు.

2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో అమరావతే రాజధాని అంటూ మద్దతిచ్చిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమంటూ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి రైతులు కోర్టుల్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత అమరావతి విషయంలో రైతులతో పాటు స్ధానికుల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన వైసీపీ సర్కార్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైంది.
గత ఎన్నిక్లలో ఓటమి తర్వాత మూడు రాజధానుల పేరెత్తకుండా జాగ్రత్తపడుతూ వస్తోంది. సరైన సమయంలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామంటూ వైసీపీ నేత బొత్స ఈ మధ్య ప్రకటించారు. అదే సమయంలో అమరావతి విషయంలో చంద్రబాబు సర్కార్ దుబారాను జగన్ పలుమార్లు ప్రశ్నించారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని కడితే సరిపోదా అని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల మూడు రాజధానుల ఆలోచన లేదని, జగన్ అమరావతి నుంచే పాలన చేస్తారంటూ చేసిన ప్రకటన ఈ ప్రాంత రైతుల్లో సంతోషం నింపింది.












Click it and Unblock the Notifications