చంద్రబాబు కాన్వాయ్ లోకి వైసీపీ వాహనాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాహనాలు రావడం కలకలం రేకెత్తించింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఉండవల్లి నుంచి తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం బయలుదేరారు. ఉంగుటూరు సమీపానికి కాన్వాయ్ వచ్చేసరికి వైసీపీకి చెందిన రెండు వాహనాలు బాబు కాన్వాయ్ లోకి వచ్చాయి. ఇవి ఉంగుటూరు నుంచి తాడేపల్లి గూడెం వరకు అనుసరించాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.
దాదాపు 15 కిలోమీటర్లు ఇవి అనుసరించినట్లు తెలుస్తోంది. బాబు కాన్వాయ్ లోకి భద్రతా నిబంధనల ప్రకారం సాధారణ వాహనాలను అనుమతించకూడదు. ఆ వాహనాలు పొరపాటున వచ్చినా ఎస్కార్ట్ నుంచి వెంటనే తప్పించాలి. దీనిపై రంగంలోకి దిగిన ఎన్ఎస్ జీ సిబ్బంది ఆ రెండు వాహనాలను నియంత్రించారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ లోకి ఇలా వాహనాలు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇరగవరంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకాల వర్షానికి వచ్చిన నష్టాలను రైతులు బాబుకు వివరించారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, ఎన్నికలకు ముందు జగన్ రైతులకు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి అంటూ బాబు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ధాన్యం ఏ మిల్లుకు వెళ్లాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోందన్నారు.

మిల్లులో ఆడించడానికి బస్తాకు కొంత అని తీసుకున్నారని, ఇప్పుడు లెక్కలో చూపకుండా అదనంగా తూకం వేయిస్తున్నారన్నారు. నాయకుడంటే కష్టం వచ్చినప్పుడు నిలబడాలని, పంటలకు బీమా ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. దీనివల్ల పరిహారం వచ్చే అవకాశం కూడా లేకపోయిందన్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ధాన్యం కొంటున్నామని కబుర్లు చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications