బీజేపీ, వైసీపీ మధ్య ఏం జరుగుతోంది - పొత్తుల లెక్కల్లో కొత్త ట్విస్ట్, గెలుపెవరిది..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల పిక్చర్ పై క్లారిటీ వస్తోంది. 2014 ఎన్నికల నాటి పొత్తులు దాదాపు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ, 2014 ఫలితాలు మాత్రం రిపీట్ కాకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని చెబుతున్నారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్ ప్రభుత్వం పైన బీజేపీ ముఖ్య నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ తనకు బీజేపీ మద్దతు లేదని తేల్చి చెప్పారు.
కొత్త సమీకరణాలు:బీజేపీ అగ్ర నేతల ఏపీ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీజేపీ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నరనే అభిప్రాయాల నడుమ ఒక్క సారిగా రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా వైసీపీ పాలన పైన అవినీతి ఆరోపణలు చేసారు. వీటిని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. కేంద్రంలో అవసరమైన ప్రతీ సందర్భంలోనూ జగన్ బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ కు కేంద్రం నుంచి అదే విధమైన సాయం అందుతూ వచ్చింది. గత రెండు నెలల కాలంలో ఎప్పటి నుంచే ఏపీకి పెండింగ్ లో ఉన్న నిధులను కేంద్రం మంజూరు చేసింది. పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలోనూ బీజేపీ నాయకత్వానికి మద్దతుగా సీఎం జగన్ నిలిచారు. దీంతో, జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఏం చేయదనే అభిప్రాయం బలంగా ఉంది.
మూడు పార్టీల పొత్తు ఖాయమా:ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా తో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తిరిగి ఎన్డీఏను విస్తరించే ప్రక్రియ ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. చంద్రబాబు ఢిల్లీ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు వద్దని తేల్చి చెప్పారు.
బీజేపీ అధినాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తు పైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తాజాగా అమిత్ షా ఆరోపణలు..సీఎం జగన్ వ్యాఖ్యలతో బీజేపీ ఏపీలో కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోందనే విషయం స్పష్టం అవుతోంది. అయితే, టీడీపీతో కలిసి వెళ్తారా.. ఒంటరిగా పోటీ చేస్తూ తాము వైసీపీకి వ్యతిరేకమనే అభిప్రాయం కలిగిస్తారా అనేది క్లారిటీ ఇవ్వాలి. అదే సమయంలో ఏపీలో టీడీపీ స్థానంలో ఎదగాలని బీజేపీ భావిస్తున్న సమయంలో 2014 తరహా పొత్తులపైన నిర్ణయంతో ముందుకు వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీలో బీజేపీ కొత్త వ్యూహం:బీజేపీతో పొత్తు పైన ఢిల్లీ పర్యటన తరువాత టీడీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. బీజేపీ ఏపీ నేతల తీరులోనూ టీడీపీ పైన కొంత మార్పు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర స్థాయిలో విమర్శలు వచ్చినా.. వైసీపీ ఎప్పుడూ సీరియస్ గా స్పందించలేదు. ఇప్పుడు నడ్డా, అమిత్ షా నేరుగా ప్రభుత్వం పైనే ఆరోపణలు చేయటంతో జగన్ అలర్ట్ అయ్యారు. ఉపేక్షిస్తే రాజకీయంగా నష్టం తప్పదని భావిస్తున్నారు.
బీజేపీ పైన తమ వైఖరి తేల్చి చెప్పారు. బీజేపీ పైన వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. బీజేపీ తాజా వైఖరి పైన టీడీపీ వేచి చూసే ధోరణితో కనిపిస్తోంది. దీంతో..2024 ఎన్నికల్లో మూడు పార్టీల పైన వైసీపీ పోరాటం చేయాల్సిన పరిస్థితులు మాత్రం ఖాయమైంది. మూడు పార్టీల కలయిక పైన సంకేతాలు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో, మూడు పార్టీల కలయిక..జగన్ ఒంటరి పోరుతో కలిసొచ్చేదెవరు.. గెలిచేదెవరు అనేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications