చంద్రబాబు కేసులో ఆళ్లకు నోటీసు.! వైసీపీకి తాజా అస్త్రం..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu), మున్సిపల్ మంత్రి నారాయణ నిందితులుగా ఉన్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో ఇవాళ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఆధారాలు లేవంటూ మూసేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో పిటిషనర్ గా ఉన్న వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరుతూ ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారంటూ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నడుస్తోంది. అయితే ప్రభుత్వం మారాక ఈ కేసును వెనక్కి తీసుకుంటూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో ఏసీబీ కోర్టు దీనిపై విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో ఫిర్యాదు దారుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరింది. ఈ కేసు మూసేయాలని దర్యాప్తు సంస్థ చెప్పిన నేపథ్యంలో అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలపాలంటూ కోర్టు దాఖలు చేసిన నోటీసులపై ఆళ్ల స్పందించాల్సి ఉంది.

అయితే గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకోబోయే నిర్ణయం చంద్రబాబు కేసులో కీలకంగా మారింది. దీంతో ఇప్పుడు తిరిగి ఆళ్లతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లి ఆయన్ను ఈ కేసు వెనక్కి తీసుకోకుండా అడ్డుపడతారా లేక ఆయన కేసు మూసివేతకు అంగీకరించి చంద్రబాబుకు సహకరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఆళ్ల అభ్యంతరాలు చెప్తే మాత్రం ఏసీబీ కోర్టు తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకూ చంద్రబాబుపై కేసుల్ని వరుసగా ఉపసంహకరించుకుంటున్న ప్రభుత్వానికి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. ఇతర కేసుల్లో ఫిర్యాదుదారులు ప్రభుత్వాధికారులే కావడంతో ఇబ్బందులు రాలేదు. కానీ ఇక్కడ వైసీపీ నేత కావడంతో సమస్యగా మారనుంది.












Click it and Unblock the Notifications