టీడీపీ-బీజేపీ పొత్తుపై వైసీపీ ఫస్ట్ రియాక్షన్..! కొత్త సీసాలో పాత సారా..
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ-జనసేన కూటమిలోకి నేడు బీజేపీ చేరబోతోంది. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ నేత అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుల చర్చలు పూర్తి చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేయడం ఖాయమైంది. అలా వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తానన్న పవన్ కళ్యాణ్ తన పంతం నెగ్గించుకుంటున్నారు. అయితే టీడీపీ-జనసేన కూటమితో కలవాలన్న బీజేపీ నిర్ణయంపై అధికార వైసీపీ స్పందించింది.
టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలయిక దాదాపు ఖరారైపోయిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన ఈ కూటమిని కొత్త సీసాలో పాత సారాగా అభివర్ణించారు. 2014-19 మధ్య కాలంలో చూసిన అవే అబద్ధాలు, అవే మోసాలు, నెరవేర్చని హామీలేగా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేనతో బీజేపీ కలిసినా ఇంతకన్నా మారేదేముందని సాయిరెడ్డి ప్రశ్నించారు. మూడు కాళ్ల కుర్చీ (టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి) కూలిపోతుందని, కాబట్టి స్ధిరమైన ప్రభుత్వానికి (వైసీపీ) తిరిగి ఓటేయాలని విజయసాయిరెడ్డి ఓటర్లను కోరారు.

ఏపీలో 2014 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కలిసి పోటీ చేయగా జనసేన పోటీ చేయకుండా మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ఘన విజయం సాధించి కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇరు పార్టీల నేతలూ రెండు చోట్లా మంత్రులుగా పనిచేశారు కూడా. అయితే 2019 ఎన్నికల నాటికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నేరవేర్చని కేంద్రంలో ఎలా ఉంటారంటూ టీడీపీపై విపక్షంలో ఉన్న వైసీపీ ఒత్తిడి పెంచడంతో చంద్రబాబు ఎన్టీయేకు గుడ్ బై చెప్పి బీజేపీపై ధర్మపోరాటం చేసి దారుణంగా దెబ్బతిన్నారు. తిరిగి ఇప్పుడు అదే బీజేపీతో కలవబోతున్నారు.












Click it and Unblock the Notifications